న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)పై సోషల్ మీడియాలో అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మొహమ్మద్ వివాదాస్పద పోస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ఆయనకు భారీ ఊరట దక్కింది. ఆపరేషన్ సింధూర్‌పై కామెంట్ చేసిన ప్రొఫెసర్‌ను ప్రాసిక్యూట్ చేయడం లేదని హర్యానా ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఇవాళ విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ధర్మాసనం ఈ కేసును విచారించింది. తొలి అవకాశంగా భావిస్తూ, ప్రొఫెసర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవడం లేదని, ఆ కేసును మూసివేస్తున్నామని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.
అదనపు సొలిసిటర్ జనరల్ ఇచ్చిన వివరణ ఆధారంగా సుప్రీం బెంచ్ ఆ ప్రొఫెసర్‌పై క్రిమినల్ కేసు దర్యాప్తును కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నది. అలీఖాన్ మొహమ్మద్‌పై సోనిపేట్ కోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భవిష్యత్తులో జాగ్రత్త వహించాలని కోర్టు చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఏదో ఒకటి రాయడం పెద్ద సమస్యను సృష్టిస్తుందని, కొన్ని సందర్భాలు చాలా సున్నితమైనవని, అలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సీజేఐ అన్నారు. ప్రాసిక్యూట్ చేయవద్దు అని ప్రభుత్వం భావించిన తక్షణమే.. మళ్లీ ఏదో ఒకటి రాయాలన్న ఆలోచన సరికాదు అని, ప్రభుత్వం పెద్ద మనసుతో ప్రవర్తించినప్పుడు, ఆ బాధ్యత తాను కూడా తీసుకోవాలని సుప్రీం బెంచ్ జనవరి 6వ తేదీ నాటి తీర్పులో పేర్కొన్నది.
గత ఏడాది మే 18వ తేదీన అలీఖాన్‌ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బీఎన్ఎస్ 152, 353, 79, 196 సెక్షన్ల కింద ఆ ప్రొఫెసర్‌ను బుక్ చేశారు. దేశ ప్రజలకు మీడియా సమావేశం ద్వారా ఆపరేషన్ సింధూర్ గురించి ఐఏఎఫ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ ఖురేషి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రొఫెసర్ అలీఖాన్ తన సోషల్ మీడియా పోస్టులో ఆ మీడియా బ్రీఫింగ్స్‌ను తప్పుపట్టారు. ఆ నేపథ్యంలో ఆయనపై కేసులను నమోదు చేశారు.