నల్లగొండ, ఫిబ్రవరి 23 : అక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతోందని, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య పెంచి అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆధ్వర్యంలో సోమవారం వివిధ పత్రికల డెస్క్ జర్నలిస్టులు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గించారని, గతంలో ప్రతి జిల్లాకు ఐదుగురికి, ఎడిషన్ సెంటర్లో 8 మంది డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వగా ప్రస్తుతం కేవలం ఎడిషన్ సెంటర్‌కు నాలుగు అక్రిడిటేషన్లు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టారని, ఈ నిబంధన వల్ల చాలామంది డెస్క్ జర్నలిస్టులు అక్రిడిటేషన్లకు దూరం అవుతున్నారని మండిపడ్డారు. డెస్క్ జర్నలిస్టులు ఎడిషన్ కేంద్రాల్లోనే పనిచేసినా ఏ జిల్లాకు ఆ జిల్లా డెస్క్‌లు వేరుగా ఉంటాయని ప్రతి జిల్లాకు ఒక ఇన్చార్జితో పాటు నలుగురు సబ్ ఎడిటర్లు ఉంటారన్నారు.
జీఓ ప్రకారం ఎడిషన్‌కు నాలుగు కార్డులే ఇస్తే కనీసం ఆ జిల్లాల ఇన్చార్జిలకు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రివేళల్లో పనిచేసే తాము తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివాళ్లమని, కనీసం అక్రిడిటేషన్ కార్డు ఉంటే హెల్త్ కార్డు అయినా తమకు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి డెస్క్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు వచ్చేలా చూడాలని కోరారు. ఈ ధర్నాకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ), టీయూడబ్ల్యూజే 143, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు గుండగోని జయశంకర్, యరెడ్ల చంద్రశేఖర్, గాదె రమేశ్, సాదత్ అలీ, డెస్క్ జర్నలిస్టులు పగడాల సురేశ్, మేకల వరుణమ్మ, ఎండీ.జమాలుద్దీన్, ఎస్డీ.జాకీర్, శ్రీనివాస్, ప్రవీణ్, నరేందర్, సైదిరెడ్డి, అరవింద్‌రెడ్డి, నరేశ్, తిరుమలేశ్, సందీప్, శ్రీను, గిరి, పుష్పలత, భార్గవి పాల్గొన్నారు.

డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ధర్నా