యాదగిరిగుట్ట, జూలై 15 : ఆలేరు నియోజవకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ పార్టీ నియోజకవర్గ నాయకులు హైదరాబాద్‌లోని గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. పార్టీ మండలాధ్యక్షుల నియామకంపై బీర్ల అయిలయ్య వర్గం, ఇతర నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటూ రచ్చను రాష్ట్రస్థాయికి చేర్చారు. ఇటీవల ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల అధ్యక్షురాలిగా కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్చార్జి బోరెడ్డి అయోధ్యరెడ్డి సతీమణి జ్యోతిని నియమించారు. ఇందుకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకపు జాబితాను విడుదల చేసింది. అయితే అప్పటికే పార్టీలో ఉంటూ తుర్కపల్లి మండలంలో క్రీయాశీలకంగా ఉన్న శంకర్‌నాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. పార్టీకి కట్టుబడి ఉంటూ బలోపేతానికి కృషి చేస్తున్న తనను ఎందుకు వైదొలగించారో చెప్పాలని గాంధీభవన్ వద్ద ధర్నాకు దిగారు. టీపీసీసీ చీఫ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు సమాచారం.
బీర్ల అయిలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్..
గాంధీభవన్ వద్ద ధర్నా చేస్తున్న వ్యక్తులపై రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. తుర్కపల్లి మండల అధ్యక్షుడి నియామకాన్ని నిరసిస్తూ బీర్ల అయిలయ్య వర్గంపై విరుచుకుపడ్డారు. వెంటనే ధర్నా విరమించాలని నియోజకవర్గ ఇన్చార్జి అయిలయ్యకు రేవంత్ గట్టి వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మొన్నటిదాకా పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్న శంకర్‌నాయక్ సస్పెన్షన్‌కు ఆదేశించారు. గాంధీభవన్ మెట్లపై ఎవరెవరు ధర్నాకు దిగారో సమాచారాన్ని రేవంత్‌రెడ్డి సేకరిస్తున్నట్లు సమాచారం.
విభేదాలు తీవ్రం..
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ బీర్ల అయిలయ్య ఒంటెద్దు పోకడతో ఉన్నాడు. తన సొంత ఫౌండేషన్‌తో ఆలేరు ప్రాంతంలో పర్యటిస్తున్నారు. మరోవైపు కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రయ్య, బోరెడ్డి అయోధ్యారెడ్డి, ఆలేరు జడ్పీటీసీ నగేశ్, బండ్రు శోభారాణి, ఆండెం సంజీవరెడ్డి, ఉపేందర్‌రెడ్డి ఏకమై బీర్ల అయిలయ్యకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీర్ల అయిలయ్యకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన మండల అధ్యక్షుల జాబితాతో విబేధాలు మరింత తారాస్థాయికి చేరుకుని రాష్ట్ర అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజా ప్రకటనలో మోటకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా అధిష్టానం ఇద్దరి పేర్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిరబోయిన మల్లేశ్‌యాదవ్, ఎల్లంల సంజీవరెడ్డి పేర్లను గాంధీభవన్ ప్రకటించింది.