సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 19 : దేశంలోనే మెట్టమొదటిదైన సర్వేల్ గురుకుల పాఠశాల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యం అవుతున్నదని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. తోటి విద్యార్థులకు రాగి జావ సర్వ్ చేస్తుండగా కాళ్ల మీద పడి తీవ్రంగా గాయపడిన విద్యార్థి సామెల్‌కు న్యాయం చేయలని కోతురూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం సర్వేల్ గురుకులం ఎదుట ఆందోళన నిర్వహించారు. బుధవారం ఉదయం ఎనిమిదో తరగతి విద్యార్ధి సామేల్ తోటి విద్యార్థులకు రాగి జావ అందిస్తుండగా, గిన్నె జారి వేడివేడి జావ కాళ్ల మీద పడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో గాయపడిన సామెల్తోపాటు మరో విద్యార్థి మదన్, వంట మనిషి బోయ ఇందిరకు న్యాయం చేయలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌తోపాటు వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్, డీవైఎప్‌ఐ, బీజేవైఎం నాయకులు గురుకులం ఎదుట ధర్నా చేశారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో 650 మంది విద్యార్థులకు కేవలం నలుగురు వంట మనుషులు మాత్రమే పని చేస్తున్నారని విద్యార్థి నాయకులు తెలిపారు. దాంతో ప్రిన్సిపాల్ రోజూ విద్యార్థులతోనే ఆహారం పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులు, వంట మనిషికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, నిరక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల ముందు బైటాయించారు.
ఆందోళన క్రమంలో విద్యార్థి సంఘం నాయకులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆర్డీఓ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నలపరాజు రమేశ్, రహేమన్, పల్లె మధు కృష్ణ, సుర్వి రాజు గౌడ్, దోనూరి వీరారెడ్డి పాల్గొన్నారు. కాగా, ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థికి గాయాలైనట్లు గుర్తించి గురుకుల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.
సామెల్‌కు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల పరామర్శ
రాగి జావ పడి తీవ్రంగా గాయపడి హైదారాబాద్‌లోని చికిత్స పొందుతున్న విద్యార్థి సామెల్‌ను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం పరామర్శించారు. అండగా ఉంటానని అతడికి కుటుంబానికి భరోసానిచ్చారు. తక్షణ సాయం కింద 10వేలు ఆర్థిక సాయం చేశారు. వైద్యాధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌తోపాటు వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని కూసుకుంట్ల డిమాండ్ చేశారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో 8, 9వ తరగతి విద్యార్థులు కూడా పుస్తకం చూసి తెలుగు, ఇంగ్లిష్ చదివే పరిస్థితి లేకపోవడం గురుకుల నిర్వహణను తేటతెల్లం చేస్తున్నదన్నారు. 650 మంది విద్యార్థులు ఉంటే సరిపడా ఉపాధ్యాయులు, వంట సిబ్బంది లేరని, పీఈటీ ఒక్కరే ఉన్నారని తెలిపారు. ఆయన వెంట చండూరు మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్రి నరసింహ, బీఆర్ఎస్వీ మునుగోడు అధ్యక్షుడు రమేశ్ ఉన్నారు.