మునుగోడు, జూలై 25 : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం ఈ నెల 28న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాని జయప్రదం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి పోలె సత్యనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సకాలంలో బిల్లులు, వేతనాలు రాక ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టలేక, కుటుంబాలు గడపలేక కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు, వేతనాలు చెల్లించాలని, వంటకు అవసరమైన గ్యాస్ ను పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా ప్రతి పాఠశాలకు అందించాలని, కొత్త మెనుకి అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కార్మికులకు రూ.10 వేల వేతనం అమలు చేయాలన్నారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు నీరుడు రాజ్యలక్ష్మి, జిల్లా నాయకులు గంగుల దమయంతి, రెడ్డిమల్ల అలివేలు, సిరిగమల్ల మల్లమ్మ, పెరుమళ్ల ప్రమీల పాల్గొన్నారు.