ముంబై, మార్చి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాల్లో సంక్షోభం నెలకొన్నది. ఇది మదుపరులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడి కారణంగా అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) రెండింటి ప్రధాన సూచీలు 1 శాతానికిపైగా క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,048.34 పాయింట్లు లేదా 1.29 శాతం పడిపోయి 80,238.85 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే ఏకంగా 2,743.46 పాయింట్లు లేదా 3.37 శాతం దిగజారి 80 వేల మార్కు కిందికి చేరడం గమనార్హం. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 312.95 పాయింట్లు లేదా 1.24 శాతం కోల్పోయి 25 వేల మార్కుకు దిగువన 24,865.70 దగ్గర నిలిచింది. ఇక ఇంట్రా-డే ట్రేడింగ్‌లో 575.15 పాయింట్లు లేదా 2.28 శాతం నష్టపోయింది.
ఇదీ సంగతి..
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటున్నది. ఇరాన్ అధినేత ఖమేనీ మృతి.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇప్పట్లో శాంతి నెలకొంటుందా? అన్న అనుమానాలకు దారితీస్తున్నది. అంతేగాక గ్లోబల్ క్రూడాయిల్ మార్కెట్‌కు గుండెకాయ వంటి ఈ ప్రాంతంలో కొరవడిన ప్రశాంతత.. ముడి చమురు ధరల్ని పెద్ద ఎత్తున ఎగదోస్తున్నది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు ఒక్కసారిగా 8.34 శాతం ఎగబాకి 78.95 డాలర్లు పలికింది. ఈ పరిణామం.. భారత్ సహా అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లను కుదిపేసింది. ఇన్వెస్టర్లను పెట్టుబడుల ఉపసంహరణకు ఉసిగొల్పింది. ఈ నేపథ్యంలోనే సెన్సెక్స్‌లోని మెజారిటీ షేర్లు సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఆయిల్, పెయింట్స్, ఏవియేషన్ రంగాల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇండిగో, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, మారుతీ, నేరోలాక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్ సంస్థల షేర్ విలువ భారీగా తగ్గింది. కాగా, ఆసియా దేశాల్లోని ప్రధాన మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోగా, చైనా మార్కెట్ లాభాల్లో ముగిసింది.
ఒత్తిడిలో పెట్రో, పెయింట్ షేర్లు
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఈలో ప్రభుత్వ రంగ సంస్థ ఐవోసీ లిమిటెడ్ షేర్ ధర 4.53 శాతం పడిపోయింది. అలాగే హెచ్‌పీసీఎల్ షేర్ 3.36 శాతం, బీపీసీఎల్ షేర్ 2.81 శాతం మేర క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగే ముడి చమురు ధరలు.. ఆయిల్ కంపెనీల లాభాలను తగ్గిస్తాయన్న ఆందోళనలున్నాయి మరి. భారత్ చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయిల్ ఆధారిత పెయింట్ ఇండస్ట్రీ షేర్లూ కుదేలయ్యాయి. నేరోలాక్ పెయింట్స్ షేర్ 3.77 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.89 శాతం, షాలిమార్ పెయింట్స్ 2.55 శాతం, బర్జర్ పెయింట్స్ 1.67 శాతం, ఇండిగో పెయింట్స్ 1.65 శాతం చొప్పున పతనమయ్యాయి. కాగా, ఇంధన ధరలు పెరిగితే విమాన చార్జీలు పెరిగి విమానయాన రంగం కష్టాల్లో చిక్కుకుంటుందన్న ఆందోళనల నడుమ ఇండిగో షేర్ ధర 6 శాతానికిపైగా దిగజారింది.
రూ.6.60 లక్షల కోట్లు ఫట్
దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు.. మదుపరుల సంపదను అంతే స్థాయిలో కరిగించేశాయి. సోమవారం ఒక్కరోజే మార్కెట్ విలువ లక్షల కోట్ల రూపాయలు హరించుకుపోయింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.6,59,978.08 కోట్లు పడిపోయి రూ.4,56,90,693.19 కోట్ల (5 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. బీఎస్ఈ లార్జ్‌క్యాప్ సూచీ 1.29 శాతం, స్మాల్‌క్యాప్ 1.81 శాతం, మిడ్‌క్యాప్ 1.67 శాతం క్షీణించాయి. రంగాలవారీగా.. సేవా రంగం అత్యధికంగా 3.81 శాతం నష్టాన్ని చవిచూసింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (2.30 శాతం), ఆటో (2.23 శాతం), కన్జ్యూమర్ డిస్క్రియేషనరీ (2.16 శాతం), చమురు-గ్యాస్ (2.15 శాతం), ఇండస్ట్రియల్స్ (2.14 శాతం), ఎనర్జీ (2.06 శాతం) రంగాల షేర్లూ నిరాశపర్చాయి. విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను అదేపనిగా వెనుకకు తీసుకుంటుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
రూపాయి 41 పైసలు డౌన్
రూపాయి తీవ్ర ఒత్తిడికి గురైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 41 పైసలు కోల్పోయి 91.49 వద్దకు జారుకున్నది. 91.23 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 91.65 కనిష్ఠ స్థాయిని తాకింది. గత ముగింపుతో పోలిస్తే 41 పైసలు నష్టపోయి 91.49 వద్ద నిలిచింది.
క్రూడ్ ధరలు పైపైకి..
పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్)లో ఇరాన్ మూడో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్నది. రోజుకు దాదాపు 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తితో ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 4.5 శాతం వాటాను కలిగి ఉన్నది. ఇక అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం.. హార్మూజ్ జలసంధి మీదుగా జరిగే రవాణాపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నది. ఈ మార్గం ద్వారానే ప్రపంచ గ్యాస్ సరఫరాలో 20 శాతం, ముడి చమురు సరఫరాలో 25 శాతం రవాణా అవుతున్నది. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం దాదాపుగా మూతబడింది. నౌకలపై ఇరాన్ దాడులకు దిగుతున్నది మరి. దీంతో చమురు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వస్తున్నది. దీనివల్ల దూరం పెరిగి రవాణా ఖర్చులు అధికమవుతుండటమేగాక, ట్రేడ్ ఇన్సూరెన్స్ వ్యయం కూడా పెరిగిపోతున్నది. తుదకు మార్కెట్లో ఆయా పెట్రో ఉత్పత్తుల ధరల విజృంభణకు దారితీస్తున్నది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80 డాలర్లకు దగ్గరైంది. మున్ముందు మరింతగా పెరుగవచ్చన్న అంచనాలున్నాయి.
నష్టాలకు ప్రధాన కారణాలు