ధరణి దరఖాస్తులు పరిష్కారం కావడంలేదు. ఆన్లైన్ అప్లికేషన్లు ముందుకు సాగడంలేదు. ధరణిలో అధిక శాతం దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నా వివిధ కారణాలతో రిజెక్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఒక్కో రైతు అప్లికేషన్‌ను మూడు, నాలుగు సార్లు కూడా తిరస్కరించిన ఘటనలు ఉన్నాయి. దీంతో కర్షకులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. పెద్ద సంఖ్యలో భూసమస్యలు అపరిష్క్రుతంగానే మిగిలిపోతున్నాయి.
– యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
ఆలేరు మండలంలోని శారాజీపేటకు చెందిన రైతు బుర్ర మధు రైతు భూమి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి. కానీ తహసీల్దార్ మాత్రం వెరిఫై చేయకుండా అప్లికేషన్‌ను రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ రైతు మరోసారి దరఖాస్తు పెట్టుకున్నారు. మళ్లీ రిజెక్ట్ కొట్టారు. ఆర్ఎస్ఆర్ కారణంగా చూపించి తిరస్కరించారని బాధితుడు వాపోతున్నాడు.
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రూపని యాదమ్మ. గుండాల మండలంలోని అంబాల గ్రామం. ఆమె భర్త రూపని వీరయ్య పేరు మీద 4 ఎకరాల 20గుంట భూమి ఉంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. ఆ భూమికి ఆన్లైన్లో భర్త పేరు రావడంలేదు. సదరు ల్యాండ్ ఆమె పేరుపై పట్టా చేసుకునేందుకు మిస్సింగ్ సర్వే నంబర్ కింద 2023 మే 23న దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం ఆన్లైన్లో వేల రూపాయల చలానా కట్టింది. సదరు దరఖాస్తును తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ లాగిన్ల నుంచి అప్రూవ్ అయ్యింది. కానీ కలెక్టర్ లాగిన్ వద్ద రిజెక్ట్ చేశారు. భూమి ఏవిధంగా సంక్రమిందనే ప్రొసీడింగ్ లేదనే కారణంతో తిరస్కరించారు. కానీ 2013-14 పాత పహణీల్లో సైతం ఆమె భర్త పేరు చూపిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని రోజులపాటు ధరణి సేవలను నిలిపేసింది. దీంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు పేరుకుపోయాయి. వీటిని పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఇందుకు కోసం ప్రత్యేకంగా టార్గెట్లను నిర్దేశించారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తహసీల్దార్లు లక్ష్యాన్ని పూర్తి చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తిరస్కరణకు గురైనవే అధికంగా ఉంటున్నాయి. వివిధ కారణాలు చూపుతూ ఇష్టారాజ్యంగా రిజెక్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జెన్యూన్ అప్లికేషన్లను కూడా తిరస్కరించినట్లు బాధితులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8వేల దరఖాస్తులు క్లియర్ కాగా, ఇందులో 50శాతం వరకు రిజెక్ట్ చేశారు.
సాధారణంగా వారసత్వ బదిలీలు, మిస్సింగ్ డేటా కరెక్షన్, సర్వే నంబర్ మిస్సింగ్, నిషేధిత జాబితా, పీవోబీ, కోర్టు కేసులు, డీఎస్ పెండింగ్ తదితర అంశాల్లో ధరణిలో దరఖాస్తు చేసుకుంటారు.అయితే రెవెన్యూ అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తే.. అందుకు గల కారణాలను సదరు కాలమ్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీంతో అధిక శాతం మంది అధికారులు ఆర్ఎస్ఆర్ సాకుగా చూపిస్తూ రిజెక్ట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కలెక్టర్ లాగిన్‌లో కూడా దరఖాస్తులు తిరస్కరణ గురువుతున్నట్లు తెలుస్తున్నది. రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం లాంగ్ పెండింగ్, నిబంధనల ప్రకారం లేకుండా, సరైన పత్రాలు లేకపోవడంతోనే తిరస్కరించినట్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో ఇంకా 4వేలు అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. భూబాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటుండటంతో అప్లికేషన్లు పేరుకుపోతున్నాయి.
జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో బహిరంగంగానే అవినీతి రాజ్యమేలుతున్నది. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని కూడా ముందుకు జరగడంలేదు. చేయి తడిపితే మాత్రం జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తుంది. ధరణి విషయంలోనూ డబ్బులు ఇస్తే పని అవుతున్నదని, లేకుంటే ఫైల్ రిజెక్ట్ కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్ రిపోర్ట్ తప్పనిసరి కావడంతో ఇదే అదనుగా కొందరు అధికారులు కింది స్థాయి సిబ్బందితో కుమ్మక్కై జోరుగా వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.