నకిరేకల్, మే 06 : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, మంత్రి కేటీఆర్ సమర్థ నాయకత్వంలో నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, తాగునీటి వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు పల్లె విజయ్, చింత స్వాతి శివమూర్తి పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా వారిని చిరుమర్తి లింగయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్లే పార్టీగా నిలిచిందన్నారు. నకిరేకల్ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో చైర్మన్, కౌన్సిలర్ల కృషి విశేషమని కొనియాడారు. ప్రతి సమస్యకు తక్షణం స్పందిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తనకు చేరవేస్తూ ఆ సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేశారని ప్రశంసించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిధులను సమర్థవంతంగా వినియోగించి, వార్డుల వారీగా అభివృద్ధి జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. పారదర్శక పరిపాలనతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారు.
ప్రజలకు చేసిన సేవ ఎప్పటికీ నిలిచిపోతుందని, మంచి పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్లో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన కాంక్షించారు. నకిరేకల్ మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తల సమన్వయం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, భవిష్యత్లో కూడా ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.

బీఆర్ఎస్ పాలనలో నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య