పెన్పహాడ్, ఆగస్టు 22 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు మండలంలో ఐదు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతారంలో ముగ్గురు, అదేవిధంగా చీదెళ్లలో ఒక ఇంట్లోనే ఇద్దరూ డెంగ్యూ భారిన పడ్డారు. బాధితులు సూర్యాపేటలో గల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు రాజేశ్ స్పందిస్తూ.. డెంగ్యూతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి తొలగించాలి. వారానికి ఒక్కరోజైనా ఇంటిలోపల, బయట నీరు నిల్వ ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంపై ఎర్రటి మచ్చలు, కొన్ని సందర్భాల్లో ముక్కులోంచి రక్తం రావడం, చిన్నారులు చాలా నిరసంగా, చికాకుగా ఉండటం, విపరీతంగా పొట్ట నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని పేర్కొన్నారు