stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 961.42 పాయింట్లు నష్టపోయి 81,287.79 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీత 317 పాయింట్లు నష్టపోయి 25,178.65 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా ఒక్క రోజులోనే మార్కెట్లో రూ.5 లక్షల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
ఇది మొత్తం సంపదలో 1 శాతానికిపైగా సమానం. ప్రస్తుతం బీఎస్ఈలో నమోదైన కంపెనీల విలువ దాదాపు రూ.463 లక్షల కోట్లుగా ఉంది. సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 82,220.48 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అంతకుముందు రోజుతో పోలిస్తే స్వల్ప నష్టంతో ట్రేడింగ్ మొదలైంది. ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయింది. చివర్లో బాగా క్షీణించింది. అమ్మకాల ఒత్తిడులు, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు వంటివి ప్రతికూల అంశాలుగా మారాయి. ఐటీ షేర్లు ఫర్వాలేదనిపించగా, ఆటో, ఫైనాన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.
భారతీ ఎయిర్టెల్, ఇండిగో, మారుతీ సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. ఇక డాలర్‌తో రూపాయి విలువ 11 పైసలు క్షీణించింది. ప్రస్తుతం రూపాయి 91.02 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 71 డాలర్ల వద్ద, ఔన్స్ బంగారం ధర 5,169 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.