రామగిరి, మే 11 : తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే ‘దోస్త్’ కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లలో పారదర్శకతకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్)ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి 2025-26 సంవత్సరానకి నోటిఫికేషన్ జారీ చేయగా.. తొలి విడుత అడ్మిషన్లకు ఈ నెల 21వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. మూడు విడుతల్లో జరిగే అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 28తో ముగియనుండగా.. 30నుంచి తొలి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్‌తోపాటు దోస్త్ మొబైల్ యాప్‌తో సైతం ఆన్లైన్ అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68 కళాశాలల్లో 28వేల సీట్లు అందుబాటులో ఉన్నా యి. గతేడాది 53శాతం సీట్లు మాత్రమే నిండగా.. ఈ పర్యాయం పూర్తిస్ధాయిలో భర్తీ జరిగేనా అనేది సందేహంగానే ఉంది. అడ్మిషన్ల వివరాల కోసం ఎంజీయూతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
దోస్త్‌లో విద్యార్థులు తమ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని http://dost.cgg.gov.in వెబ్సైట్లో గానీ DOST మొబైల్ యాప్‌లో గానీ లాగిన్ కాగానే దోస్త్ ఐడీ, పిన్ నెంబర్ వస్తుంది. వీటిని ఉపయోగించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఓపెన్ అయిన సైట్లో యూనివర్సిటీ, కళాశాలలు, కళాశాలల వారీగా ప్రాధాన్యత క్రమంలో కోర్సుల ఎంపిక, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సిలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంచుకున్న కళాశాలకు వెళ్లి అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు చూపించి వారు అక్కడ అడిగిన సర్టిఫికెట్స్ అందజేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.