ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎనిమిది కాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధిక ఉష్ణోగ్రతలతో మూగ జీవాలకు వడదెబ్బ కొట్టే ప్రమాదముందని, తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించుకోవాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో జీవాల్లో వచ్చే సమస్యలు, వాటి నివారణ చర్యలు, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హుజూర్నగర్ పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.
– నల్లగొండ రూరల్, మే 21
వడదెబ్బను ఇలా గుర్తించాలి
వేసవిలో మనుషులే కాదు.. పశువులు కూడా వడదెబ్బకు గురవుతుంటాయి. అధిక ఊష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండడం, నీళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి బలహీనంగా మారుతాయి. శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. చర్మం పొడిబారుతుంది. పశువులు సరిగా నడవలేక తూలుతూ ఉంటాయి. ఎప్పుడూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోయి ఆకలి మందగిస్తుంది. దాంతో ఆహారం తక్కువగా తీసుకుంటాయి. ఫలితంగా పాల దిగుబడి తగ్గుతుంది. పశువులు ఎదకు రాకపోగా చూడి కట్టె అవకాశాలు కూడా తక్కువే. రోగ నిరోధకశక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం ఉంటుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంతల్లోని నీటిని తాగడంతో జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. రొప్పుతూ శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఒక్కోసారి అపస్మారక స్థితికి వెళ్లి మృతి చెందే అవకాశముంది.
జీవాల ఆరోగ్య పరిరక్షణ
జీవాలను వేసవిలో ఉదయం 6నుంచి 10గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు మేతకు తీసుకెళ్లాలి. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే చెట్టు నీడలో నిలబడేలా చూడాలి. షెడ్లకు ఇరువైపులా గోడలు పూర్తిగా కట్టకూడదు. వీలైతే షెడ్లలో షవర్స్, స్ప్రింక్లర్లను అమర్చాలి. నీటి తుంపర్లు జీవాల మీద పడేలా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా నల్లటి జీవాలకు (గేదె, నల్ల గొర్రె, నల్ల మేక) ఇబ్బందులెక్కువ. నల్లటి శరీరం కలిగిన జీవాలు ఉష్ణోగ్రతను శోషణం చేసుకునే వీలుంటుంది. వేసవి తాపానికి గురైన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించని పశువులు, గొర్రెలు, మేకల్లో గాలికుంటు, గొంతు వాపు, జబ్బ వాపు వంటి వ్యాధులు సోకుతాయి. పశువులు మురుగు నీరు తాగడం వల్ల పారుడు, జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది. కావున మంచి చల్లని నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంతర పరాన్న జీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులను క్రమం తప్పకుండా తాగించాలి.
పచ్చిగడ్డిని ఇవ్వాలి
వేసవిలో పశువులను ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు తీసుకెళ్లాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగేలా చూడాలి. వేసవి తాపంతో పశువుల్లో జీర్ణక్రియ మందగిస్తుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ వంటివి అందించాలి. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. మాగుడు గడ్డి ఉంటే సమృద్ధిగా అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం, ఎండు గడ్డిని రాత్రి సమయాల్లో కత్తిరించి ఇవ్వాలి. అధిక పాలను ఇచ్చే పశువులకు దాణాలో నీటిని కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మరీ మంచిది.
తీసుకోవాల్సిన చర్యలు
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. చల్లని నీటితో పశువు ముఖాన్ని కడగాలి. ఐస్‌ను వస్త్రంలో చుట్టి పశువు నుదుటిపై ఉంచాలి. పశు వైద్యుడిని సంప్రదించి స్లైన్ ఎక్కించాలి. పశువు కోలుకునే వరకు చాప్ కట్టర్‌తో కట్ చేసిన పచ్చిగడ్డిని మాత్రమే అందించాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణాన్ని ఇవ్వాలి. ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే మేత కోసం బయటకు తీసుకెళ్లాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో నీడ ప్రదేశాలకు తరలించడం ఉత్తమం.
పశువులకు వెంటనే చికిత్స చేయించాలి
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వచ్చే ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగాలి. తల నుదుటి మీద మంచు ముక్కలు ఉంచడం, చల్లని గోనె సంచిని కప్పడం వంటివి చేయాలి. పశు వైద్యుడి పర్యవేక్షణలో గ్లూకోజ్ స్లైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి అవసరమైన చికిత్స చేయించాలి.
– కొణతం శ్రీనివాస్‌రెడ్డి, పశువైద్యాధికారి, హుజూర్నగర్