కొండమల్లేపల్లి, మే 4 : కొండమల్లేపల్లి పట్టణంతో పాటు మండంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకున్న లైట్లు, బల్బులు రోజంతా వెలుగుతూనే ఉన్నాయి. దీంతో లో ఓల్టేజీ సమస్య తలెత్తి విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడడంతో ఇండ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కూలర్లు కాలిపోయి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని అయా గ్రామల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ దీపాలకు ఆన్, ఆఫ్ స్విచ్‌లు లేక పోవడంతో రాత్రితో పాటు పగలు కూడా వెలుగుతూనే ఉన్నాయి. దీంతో అయా గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు పేరుకుపోతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి కరెంట్ వృథాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
కొండమల్లేపల్లి మండంలో మొత్తు 26 గ్రామపంచాయతీలుండగా వాటి పరిధిలో 6 అనుబంధ గ్రామాలున్నాయి. కొన్ని గ్రామా ల్లో అంతర్గత బజార్లలో వీధి దీపాలకు ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో 24 గంటలూ వెలుగుతున్నాయి. ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అయా గ్రామాల, కొండమల్లేపల్లి పట్టణ ప్రజలు వాపోతున్నారు. కొండమల్లేపల్లి మండంలోని కోల్ముంతల్పమాడ్, గాజీనగర్, వడ్త్యాతండా, రమావత్తండా, చిన్నఅడిశర్లపల్లి, గుడాతండా, వర్ధమానిగూడెం, గన్యానాయక్తండా, దంజిలాల్‌తండా, చెన్నారం, చేపూర్తండా, రామునిగుండ్ల తండాల్లో ఉన్న విద్యుత్ లైన్‌కు ఏర్పాటు చేసిన వీధి దీపాలకు ఆన్, ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయలేదు. పట్టపగలు కూడా వెలుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
మండలంలోని సగానికి పైగా గ్రామాల్లో స్తంభాలకు వీధి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉండడంతో గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. ప్రతి నెలా పంచాయతీ అధికారులు కొన్ని బిల్లులు చెల్లించినా మరికొన్ని పెండింగ్‌లోనే ఉంటున్నాయి. గ్రామాల్లో పట్టపగలు వీధి దీపాలు వెలుగుతున్నా అయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల్లో వీధి దీపాలు కాలిపోయినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి విద్యుత్ వృథాను ఆరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.