మునుగోడు, మార్చి 13 : నీటి వసతి ఆధారంగా రైతులు పంటల సాగును ఎంచుకోవాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. గురువారం మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో ఎండిపోతున్న వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండిపోయిన బోర్లను ఇంకుడు గుంతల సాయంతో రీచార్జ్ చేసుకోవాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల భూమికి నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందన్నారు. విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడితో భూమిలో చౌడు పెరుగుతుందని చెప్పారు.
రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, ఇతర కూరగాయలు సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు బిందు సేద్యంలో ఆయిల్ పామ్ తోటల పెంపకం కూడా చేపట్టవచ్చన్నారు. దీనికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని తెలిపారు. ఒక ఎకరం వరి సాగు చేసే నీటితో 4-5 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఎం.నర్సింహ్మ, రైతులు పాల్గొన్నారు.