కట్టంగూర్, మార్చి 28 : యాసంగి సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. కట్టంగూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కరువుఛాయలు తీవ్రంగా ఉన్నాయి. మండలంలో 20,400 ఎకరాల్లో వరిని సాగు చేయగా అందులో ఆయకట్టు కింద 3,650 ఎకరాలు, నాన్ ఆయకట్టు కింద 16,750 ఎకరాలు ఉన్నది. ఇస్మాయిల్పల్లి, మునుకుంట్ల, పిట్టంపల్లి, నారెగూడెం, ఈదులూరు, పరడ, కురుమర్తి గ్రామాల్లో గతేడాది కంటే ముందుగానే భూగర్భజలాలు తగ్గడంతో పొట్ట దశలో ఉన్న వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయి. ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. పంటలను కాపాడుకునపేందుకు అప్పులు చేసి కొత్తగా బోరు బావులను 500 నుంచి 800ఫీట్ల వరకు వేసినా చుక్కనీరు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేటట్టు లేదని దిగులుపడుతున్నారు. ఎండి న వరి పొలాలను పశువులకు మేత గా వదిలేస్తున్న దుస్థితి నెలకొంది.
వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబం మాది. నాకు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఎకరాల్లో వరి, మిగతా రెండున్నర ఎకరాల్లో దొండ, గోంగూర సాగు చేసిన. భూగర్భజలాలు అడుగంటడంతో రెండు పాత బోరు బావుల్లో నీళ్లు లేక వరి పొలం, దొండ పంట ఎండిపోయింది. కళ్ల ముందే ఎండిన వరిపొలాన్ని చూసి కన్నీళ్లు ఆగడంలేదు. పంటను కాపాడుకునేందుకు 75వేల రూపాయలు పెట్టి కొత్త బోరు వేసినా చుక్కనీరు రాలేదు. ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. పెట్టుబడులు, బోర్లకు చేసిన అప్పులు ఎట్ల తీర్చాలో అర్థం కావడంలేదు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.