రైతన్నకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో రోజురోజుకు కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి బోర్లు, బావులు మరోవైపు వట్టిపోవడంతో నీళ్లు లేక పొట్ట దశలో వరి పొలాలు ఎండి పోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు మేకలు, గొర్రెల మేతకు పంటలను వదిలిపెడుతున్న దుస్థితి నెలకొంది.
జిల్లాలో 2.8 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. అధిక శాతం మంది వరి వేశారు. ఆయకట్టేతర ప్రాంతాల్లో ఎకువ శాతం బోర్లు, బావుల కిందే వరి సాగు చేశారు. జిల్లాలో ఇప్పటికే అన్ని చోట్ల వరి పైర్లు పొట్ట దశకు వచ్చాయి. ఈ సమయంలో నీళ్లు సరిపడా అవసరం. కానీ చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోయాయి. బోర్లు కూడా వట్టిపోవడంతో నీటి తడికి కష్టమవుతున్నది. భువనగిరి, ఆత్మకూర్.ఎం, రాజాపేట, గుండాల, అడ్డగూడూరు, సంస్థాన్‌నారాయణ పురం, భువనగిరి తదితర మండలాల్లో వరి పైర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికే రెండు వేల ఎకరాలకుపైగా పంట నష్టం జరిగినట్టు తెలుస్తున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకపోవడంతో రైతులు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు. సుమారుగా ఒకో ఎకరానికి రూ.26వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఇందులో దున్నకం, నాట్లు, విత్తనాలు, ఎరువులు, మందులు, కూళ్లు, ఇతర పనులకు ఖర్చు చేశారు. ఎకరాకు 28 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని భావించారు. క్వింటాకు రూ. 2వేలు అనుకున్నా రూ.56 వేలు రావాల్సి ఉంది. ఎకరం భూమి సరిగ్గా పంట దిగుబడి వస్తే పెట్టుబడి పోనూ రూ. 33వేలు లాభం రైతుకు మిగాలి. ఇప్పుడు పంటలు ఎండిపోవడంతో ఎకరానికి రూ. 30 వేల వరకూ నష్టం వాటిల్లినట్లు వాపోతున్నారు. ఇక ప్రభుత్వం రైతు భరోసా జమ చేయకపోవడంతో పెట్టుబడికి అప్పులు తెచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
రోజురోజుకూ పరిస్థితులు తీవ్రం
జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. జనవరి నెలలో భూగర్భ జలాలు 10మీటర్ల లోతుకు వెళ్లాయి. గతేడాది జనవరి నెలలో ఉన్న భూగర్భ జలాలతో పోలిస్తే గణనీయంగా 2.71 మీటర్లు తగ్గాయి. సంస్థాన్‌నారాయణపురం మండలంలో ఏకంగా 11.48 మీటర్ల మేర కిందికి పడిపోయాయి. ఆత్మకూర్ (ఎం)లో 17.10, తురపల్లి, ఆలేరు, బొమ్మలరామారం, రామన్నపేట, మోటకొండూర్ మండలాల్లో 11 మీటర్ల దూరంలో ఉన్నాయి. నీటిమట్టం పడిపోవడంతో బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. కొన్ని చోట్ల బోర్లు ఆగి ఆగి పోస్తున్నా పంటలకు ఏమాత్రమూ చాలడం లేదు.
నీళ్లు లేక పశువుల పాలు
ఆత్మకూరు(ఎం) : మండలంలోని తుక్కాపురం గ్రామంలో రైతు ఎరుకల నవీన్‌గౌడ్ మూడెకరాల్లో వరి పంట సాగు చేశాడు. నీళ్లు లేకపోవడంతో ఎకరంనరలో పంట ఎండిపోయింది. దాంతో పశువులను మేపుతున్నాడు.
పదేండ్లలో ఇంత కరువు చూడలేదు
నేను మూడెకరాలు, మా తమ్ముడు మూడెకరాలు వరి పెట్టినం. ఇద్దరికి కలిపి ఒక్కటే బోరు ఉంది. ఒక్క బోరుతోనే ఆరు ఎకరాలు పంట పండించేవాళ్లం. ఆరెకరాల మీద అప్పు చేసి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినం. పంట పొట్టకు వచ్చింది. 15 రోజులు అయితే చేతికి వస్తుంది. ఈ టైమ్‌లో బోరు ఎండిపోయింది. పదేండ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. చేసేది లేక ఎండిపోయిన పొలంలో గొర్లు, పశువులను మేపుతున్నాం. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించాలి.
-బచ్చనగోని రాములు, రైతు, ఆరెగూడెం గ్రామం (సంస్థాన్ నారాయణపురం మండలం)