యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకూ భూగర్బ జలాలు పడిపోతున్నాయి. గత నెలలో సంస్థాన్ నారాయణపురంలో ఏకంగా 27.72 మీటర్ల లోతుకు ఇంకాయి. జిల్లా సగటు నీటి మట్టం కూడా తగ్గింది. దాంతో బోర్లు నీళ్లు పొయ్యక పంటలు ఎండిపోతున్నాయి.
జిల్లాలో ఏడాదిన్నరగా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. నెలనెలా నీటి మట్టం తగ్గుతున్నది. ఈ ఏడాది మార్చిలో సగటున 12.05 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు ఇంకిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 9.94 మీటర్లలో నీళ్లున్నాయి. అంటే 2.11 మీటర్ల కిందకు పాతాళ గంగ పడిపోయింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.95 మీటర్ల వద్ద నీటి మట్టం కేవలం నెల వ్యవధిలో 1.10 మీటర్లు ఇంకిపోవడం గమనార్హం.
కారణాలు ఇవే..
భూగర్భజలాలు పడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షపాతం తకువగా నమోదైంది. చెరువులను నింపడంలో ప్రభుత్వం విఫలమైంది. నీటి తోడకం, వాడకం ఎకువవడం కూడా ఓ కారణంగా అధికారులు చెప్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలతోపాటు తాగునీటికి అవసరాలు కూడా పెరిగినట్లు పేర్కొంటున్నారు.
పంటలు ఆగం
జిల్లాలో ఎక్కడ చూసినా నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. పొట్ట దశకు వచ్చిన సమయంలో నీళ్లు చాలక దెబ్బతింటున్నాయి. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి తడులు అందిస్తున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలు ఎండిపోయాయి. గేదెలు, గొర్రెల మేతకు తప్ప ఆ పొలాలుఎ ఎందుకూ పనికిరాని పరిస్థితి దాపురించింది.
మండలాల్లో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 17 మండలాలు ఉండగా, భూదాన్‌పోచంపల్లి మినహా 16 చోట్ల భూగర్భ జలాలు పడిపోయాయి. ముఖ్యంగా సంస్థాన్‌నారాయణపురం పట్టణంలో 27.72 మీటర్లు లోతుకు చేరాయి. ఈ మండలం సగటు 24.56 మీటర్లుగా నమోదైంది. గతేడాది ఇకడ 15.45 మీటర్లు లోతులో నీళ్లుండేవి. ఆత్మకూరు(ఎం)లో 19 మీటర్లు, రామన్నపేటలో 14.27, బొమ్మలరామారం14, బీబీనగర్ 13.86, భువనగిరిలో 13. 71, ఆలేరులో 13.15, మోటకొండూర్ 12.65, రాజాపేటలో 12.15, తురపల్లిలో 12, మోతూరులో 11.46, గుండాలలో 10.22, యాదగిరిగుట్టలో 10.21 మీటర్లలోపులో భూగర్భ జలాలు ఉన్నాయి.