ఎండిన పొలంలో కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు మల్లికార్జున్‌రెడ్డి. ఊరు ఎర్రంబెల్లి. మూడెకరాల భూమి ఉంది. సాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఎకరం మాత్రమే సాగు చేశాడు. ఇప్పుడు ఆ ఎకరం కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు ఎండిపోవడంతో నీళ్లకు నానా కష్టాలు పడ్డారు. అక్కడకక్కడ పచ్చగ ఉన్న పంటనైనా కాపాడుకోవాలని ట్యాంకర్ ద్వారా నీళ్లు పెడుతున్నాడు. రోజుకు ఐదు నుంచి పది ట్యాంకర్ల నీళ్లు కొనుగోలు చేస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 అవుతున్నట్లు మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. ఈ గ్రామంలోని అనేక మంది రైతులు ఇదే పరిస్థితి.
Yadadri | యాదాద్రి భువనగిరి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లి గ్రామంలో నీటి కోసం అల్లాడుతున్నది. సాగునీరు లేక ఎక్కడ చూసినా పొలాలు నెర్రెలు వారుతున్నాయి. చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. ఎక్కడైనా కొద్దొగొప్పో ఆశాజనకంగా ఉన్న పొలాలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. తలాఫున కాళేశ్వరం కాల్వ, బునాదినాని కాల్వ ఉన్నా నీళ్లు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు గ్రామంలో తాగునీరు, గృహ అవసరాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
ఎర్రంబెల్లి గ్రామంలో 200 వరకు కుటుంబాలు ఉన్నాయి. 600 వరకు జనాభా ఉంది. ఈసారి వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు సాగుకు వెనుకంజ వేశారు. అనేక మంది నాలుగు మడులకు బదులు ఒక మడి మాత్రమే చేశారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోవడంతో బోర్లు, బావులు ఎండిపోయాయి. దాంతో సాగు చేసిన అరకొర పంట కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అనేకమంది కొత్తగా బోర్లు వేసినా చుక్క నీరు పడడం లేదు. ఫలితంగా ఎకరాలకు ఎకరాలు ఎండిపోయాయి. చేసేది లేక రైతులను పంటలను పశువుల మేతకు వదిలిపెడుతున్నారు. ఇంకొంతమంది రైతులు చివరి ప్రయత్నంగా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్నారు. వారం, పది రోజులు నీళ్లు అందిస్తే పంట చేతికి వస్తుందనే ఆశతో ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 నుంచి 800 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు.
ఊరికి ఆనుకునే కాల్వలు ఉన్నా..
ఎర్రంబెల్లి మీదుగా అటు కాళేశ్వరం కాల్వ, ఇటు బునాదిగాని కాల్వ వెళ్తున్నాయి. రెండూ మీటర్ల దూరంలోనే ఉన్నాయి. గతంలో బునాదిగాని కాల్వకు నీళ్లు వదిలేవారు. బునాదిగాని చెరువు నిండేది. ఈసారి కాల్వతోపాటు బునాదిగాని చెరువు కూడా ఎండిపోయింది. అనాజిపురం చెరువు కూడా ఎండిపోయే దశకు చేరడంతో నీళ్లు వదలడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు ఇంకి.. సాగునీటికి కష్టాలు తప్పడం లేదు. మరోవైపు కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కాల్వ కూడా వృథాగా ఉంటున్నది. బస్వాపూర్ నుంచి కాల్వ వచ్చే మార్గంలో కలెక్టరేట్ సమీపంలో జాతీయ రహదారి వద్ద లింక్ పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా కనీసం పట్టించుకోలేదు. బస్వాపూర్ నుంచి జలాలను విడుదల చేస్తున్నా లింక్ లేకపోవడంతో ఎర్రంబెల్లి కాల్వకు నీళ్లు రావడంలేదు.
తాగునీటికీ కష్టాలే..
గ్రామంలో తాగు నీరు, ఇతర అవసరాలకు సైతం అవస్థలు తప్పడం లేదు. గతంలో నీటి సరఫరా బాగానే ఉండేదని, ఇటీవల సరిగ్గా లేదని గ్రామస్తులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులకోసారి నీళ్లు వదులుతున్నారని, రెండు, మూడు బిందెలు కూడా రావడం లేదని వాపోతున్నారు. దాంతో అనేక మంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
సాయంత్రం తర్వాత జనరేటరే దిక్కు..
నేను తొమ్మిదెకరాల్లో వరి పెట్టాను. ఐదు బోర్లు ఉంటే నాలుగు ఎండిపోయాయి. ఇప్పటికే ఎకరం వరకు పంట ఎండిపోయింది. పంట చివరి దశకు వచ్చింది. ఎట్లయినా కాపాడుకోవాలని అరకిలోమీటరు దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నా. అందుకు పైపులకే 30 వేల రూపాయలు అయినయ్. ప్రభుత్వం సాయంత్రం 5గంటల నుంచి కరెంట్ సరఫరా బంద్ చేస్తుండడంతో ఐదింటి నుంచి రాత్రి 11గంటల వరకు జనరేటర్ వాడుతున్న. అప్పుడైతే జర నీళ్లు వచ్చే అవకాశం ఉంటున్నది. గంటకు మూడు లీటర్ల డీజిల్ పడుతున్నది. రోజుకు 1,500 నుంచి 2వేల రూపాయలు డీజిల్‌కే అయితున్నయ్. వారం, పది రోజులైతే పంట చేతకొస్తది. మాకు బునాదిగాని కాల్వ ఉన్నా ఈసారి నీళ్లు లేక ఎండిపోయింది. కాళేశ్వరం కాల్వకు లింక్ ఇస్తే ఇన్ని బాధలు ఉండేవి కాదు.
– పడమటి మధూసదన్ రెడ్డి, రైతు, ఎర్రంబెల్లి