ఈ ఫొటో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి కొనుగోలు కేంద్రంలోనిది. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రం వద్ద ధాన్యం ఇలా తడిసి మొలకెత్తింది. తుర్కపల్లి మండలంలోని మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగడంలేదు. వాసాలమర్రిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు లారీల ధాన్యం మాత్రమే ఎగుమతి చేశారు. దీంతో వర్షాలతో ధాన్యం తడిసి, మొలకలు వచ్చి రైతులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సర్కారు నిర్లక్ష్యంతో రైతులు ఆగమైతున్నరు. జిల్లాలో వరుస వర్షాలతో వడ్లన్నీ తడిసి ముద్దవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొలకెత్తుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెబుతున్నా అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేపడుతున్నది. కేంద్రాల్లో కొన్న ధాన్యం తరలింపులో జాప్యం చేస్తున్నది. మొదటి నుంచీ ఉన్న లారీల సమస్య ఇంకా తీరలేదు. అంతిమంగా అన్నదాత అష్టకష్టాలు పడుతున్నారు.
జిల్లాలో యాసంగిలో 2.93లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. సుమారుగా 5.25లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. సివిల్ సప్లయ్ అధికారులు నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 323 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే ధాన్యం కొనుగోళ్లు మాత్రం సరిగా జరుగడంలేదు. ఎక్కడ పోసిన ధాన్యం కుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.

అకాల వర్షాలు రైతులను ఇబ్బదులు పెడుతున్నాయి. జిల్లాలో ఇటీవలి కాలంలో నిత్యం అనేక చోట్ల వానలు దంచికొడుతున్నాయి. అయితే కేంద్రాల్లో వర్షం నుంచి రక్షించుకునేందుకు సరిపడా టార్పాలిన్లు, షెడ్లు లేకపోవడంతో ధాన్యం తడిసి మొలకెత్తుతున్నది. ఈ క్రమంలో వడ్లను కాపాడుకునేందుకు కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్లను కనీసం ఆరబెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం తడిసిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. చేతికొచ్చిన పంట ఆగం అవుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ప్రభుత్వం ధాన్యం కాంటా వేసినా తరలింపులో మాత్రం జాప్యం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే దర్శనమిస్తున్నది. కేంద్రాల వద్ద కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా లారీ కొరత. లారీల కోసం రైతులు దీనంగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచీ లారీల కొరత ఉంది. సమస్య ఉన్నదని తెలిసినా పరిష్కారం కావడం లేదు. మరోవైపు హమాలీల సమస్య కూడా వేధిస్తున్నది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోతుండటంతో వర్షం వస్తే తడిసి ముద్దవుతున్నది.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా.. ప్రతిపక్షాలు మండిపడుతున్నా కొనుగోళ్లలో మాత్రం స్పీడ్ పెరుగడంలేదు. జిల్లాలో కేంద్రాలు ప్రారంభించి నెలన్నర దాటిపోయినా ఇప్పటి వరకు 2,64,093 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఇంకా సుమారు లక్షన్నర టన్నుల వరకు ధాన్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి. కానీ.. ఈ సారి మాత్రం ఆ పరిస్థితులు కనిపించడంలేదు.
ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనడం లేదు. ధాన్యం తెచ్చినప్పటి నుంచి మూడు నుంచి నాలుగు సార్లు వర్షం పడింది. తడిసిన ధాన్యం ఎండబెట్టడం మళ్లీ కుప్ప నూర్చడానికే సరిపోతుంది. వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలా జరుగలేదు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి.
– గణేశ్, రైతు, కొండాపురం, తుర్కపల్లి మండలం
పెంచికల్పహాడ్ ఐకేపీ సెంటర్లో నెల రోజుల నుంచి వడ్లు కాంటా పెట్టడంలేదు. కాంటా పెట్టినా ధాన్యం ట్రాన్స్పోర్టు చేయడంలేదు. ఇటీవల కురిసిన వర్షానికి వడ్లు తడిసి మొలకెత్తాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు అరిగోస పడుతున్నాం. ప్రభుత్వం, అధికారులది హడావుడే తప్ప ఆచరణలో కనిపించంలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
కాయకష్టం చేసి పండించిన వడ్లు సర్కారు ధరకు అమ్మేందుకు నాలుగు వారాల కిందట తీసుకుపోయి కొనుగోలు సెంటర్లో కుప్ప పోసిన. ఇంటిల్లిపాది దినాం ఇరాం లేకుండా గలగల ఎండేవరకు మండుటెండల ఎండబోసినం. ఒక్క సారు కూడా వడ్ల కాడికి వచ్చి గిప్పుడో అప్పుడో కొంటామని చెప్పినోళ్లు లేరు. గిప్పుడేమే కాలంగాని కాలంలో వానలు పడవట్టె. కుప్ప పోసిన వడ్లు వానకు తడిసిపోయి మొలకలు రాబట్టె. వడ్లు కొనండి సారు అని కాళ్లవేల్లాబడి మొక్కినా కనికరిస్తలేరు. వానకు తడిసిన వడ్లను మల్ల ఆరబోసినాక చూస్తాంలే అని బుకాయిస్తున్నారు. ఆ సార్ల మాటలు వింటుంటే కష్టమంతా భూదేవి పాలవుతుంని గుబులేస్తుంది.
– గొడుగు మల్లయ్య రైతు పాముకుంట, రాజాపేట మండలం