గుర్రంపోడు, ఏప్రిల్ 11 : అకాల వర్షం అన్నదాతకు నష్టం మిగిల్చింది. గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరితోపాటు మామిడి, మొక్క జొన్న, ఉద్యానం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గుర్రంపోడు మండలంలో కోతకు వచ్చిన వరి పొలాలు నేలకు వాలాయి. బొప్పాయి చెట్లు విరిగిపోయాయి.
కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని అంచనా వేయడానికి శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన అధికారులు మండలంలోని కొప్పోలు, పిట్టలగూడెం, బ్రహ్మణగూడెం, కోనాయిగూడెం, జిన్నాయిచింత తదితర గ్రామాల్లో పర్యటించారు. పిట్టలగూడెంలో కూరగాయ పంటలతోపాటు బొప్పాయి పంటకు నష్టం వాటిల్లినట్లు హెచ్ఓ మురళి తెలిపారు.
రెండు ఎకరాల్లో సోర పందిరి వడగండ్లకు దెబ్బతిన్నదని, రూ.రెండు లక్షల పంట నష్టం జరిగిందని రైతు కేసాని అనంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. జిన్నాయిచింతలో మారపాక మార య్య రైతుకు చెందిన 1500 బొప్పాయి చెట్లు నేలకూలాయి. రూ.10 లక్షల నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు. పిట్టలగూడెంలో పొగాకు నారాయణ రైతుకు చెందిన ఆరు ఎకరాల్లో చేతికొచ్చిన బొప్పాయి పంట నేలపాలైంది. రూ.12 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు. మండలంలో 20 ఎకరాల్లో ప్రధానంగా ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు నివేదికను అందించామని మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి తెలిపారు.
పెద్దవూర : మండలంలో అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. పోతునూరు తదితర గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది.
పెద్దఅడిశర్లపల్లి : అకాల వర్షానికి గుడిపల్లి మండలంలోని ఘనిపల్లి గ్రామంలో గాదె ప్రతాప్‌రెడ్డి, గాదె విద్యాసాగర్‌రెడ్డికి చెందిన దాదాపు 10 ఎకరాల మొక్క జొన్న పంట నేలవాలింది. మొక్క జొన్న కంకి పడుతున్న సమయంతో గాలి వానకు దెబ్బతిన్నదని, భారీగా నష్టం జరిగిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు గ్రామంలో రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఐదారు టన్నుల మామిడికాయలు నేలరాలాయి. సుమారు 4లక్షల మేర నష్టం వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి.
– తమ్మ శ్రీను, రైతు, పోతునూరు, పెద్దవూర