కట్టంగూర్, అక్టోబర్ 07 : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవన్లో జరిగిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీని ఓడించడానికి సీపీఎం పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సీపీఎం ముందుకు వెళ్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పని చేయడానికి జిల్లా కమిటీ నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
జిల్లాలో 120 ఎంపీటీసీలు, 200 సర్పంచులు, 2 వేల వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు పార్టీలో చర్చిస్తున్నామన్నారు. గెలుపోటములు నిర్వహించే శక్తి సీపీఎం పార్టీకి ఉందని, ఒంటరిగా పోటీ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, నాయకులు చిలుముల రామస్వామి, గడగోజు రవీంద్రాచారి, జాల రమేశ్, ఊట్కూరి శ్రీను, జాల ఆంజనేయులు, కక్కిరేణి రామస్వామి, గంట వెంకన్న, సాగర్ రెడ్డి పాల్గొన్నారు.