Valentin Henault | గోరఖ్‌పూర్ జైలులోని అమానవీయ పరిస్థితులను కళ్లకు కడుతూ ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ రచించిన J’avais un rêve indien (నాదొక భారతీయ కల: గోరఖ్‌పూర్ జైలు నరకంలో…) అనే పుస్తకం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 2026 జనవరి 15న విడుదలైన ఈ పుస్తకంలో, 2023 అక్టోబర్-నవంబర్ కాలంలో తాను అనుభవించిన జైలు జీవితంపై ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు.
ఫిబ్రవరి 21 ఒక ఇండియన్ మీడియా సంస్థతో వాలెంటిన్ మాట్లాడుతూ.. భారతదేశంలో దళిత మహిళలపై జరుగుతున్న కుల వివక్షపై డాక్యుమెంటరీ తీసేందుకు బిజినెస్ వీసాపై వచ్చిన హెనాల్ట్ను, గోరఖ్‌పూర్‌లో జరిగిన అంబేద్కర్ భూపోరాట యాత్రలో పాల్గొన్నారనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ విషయంపై అతడు మాట్లాడుతూ.. తనపై మోపిన వీసా ఉల్లంఘన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమని ఆయన కొట్టిపారేశారు. జైలు లోపల పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయని, కేవలం 300 మంది పట్టే ఒకే బ్యారెక్కులో ఖైదీలను గాలి కూడా ఆడనంతగా కుక్కేవారని ఆయన పేర్కొన్నారు. సరైన వైద్యం అందక ఖైదీలు మరణిస్తున్నా గార్డులు తలుపులు తీసేవారు కాదని, జైలు గోడల మధ్య కూడా కుల వివక్ష తీవ్రంగా ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా ముస్లింలను విడిగా ఉంచడం, అగ్రవర్ణాల వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించి, దళిత ఖైదీలను మరుగుదొడ్ల పక్కన చీకటి గదుల్లో ఉంచడం వంటి సంఘటనలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని హెనాల్ట్ రాసుకొచ్చారు.
నేను ఇప్పటికీ భారతదేశాన్ని ప్రేమిస్తాను, కానీ ఇప్పుడు నాలో ఒక బలమైన రాజకీయ దృక్పథం ఏర్పడింది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఫ్రెంచ్ భాషలో మాత్రమే ఉన్న ఈ పుస్తకం, భారతీయ జైలు వ్యవస్థలోని లోపాలను ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ వాస్తవాలు స్థానిక ప్రజలకు చేరాలంటే ఈ పుస్తకాన్ని వెంటనే ఇంగ్లీష్ మరియు ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.