Harish Rao | కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. డీపీఆర్ లేదు.. ఎఫ్టీఎల్ తేలలేదు.. అనుమతులు లేవు.. ఏ చట్టం ప్రకారం ఇండ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇండ్లు కూల్చే బదులు నీళ్ల ట్యాంకులో విషం కలిపి చంపండి అని తల్లులు ఆవేదన చెందుతున్నా ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేదా అని ప్రశ్నించారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులు భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంఛార్జి కార్తీక్ రెడ్డి తదితరులు కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపిన హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మేం మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎస్టీపీలు కట్టు, మురుగునీరు రాకుండా చెయ్, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్లతో మూసీని శుద్ధి చెయ్. కానీ మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. బాపు ఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి తప్ప.. ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ, హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇండ్లు ఖాళీ చేస్తారా, లేక జేసీబీ పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి ఈ అపార్ట్మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు.. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అది అని పేర్కొన్నారు. ఇండ్లు కూల్చడమంటే ఇక్కడి బతుకులను కూల్చడమే అని స్పష్టం చేశారు. పసిపిల్లలు కంటిమీద కునుకు లేకుండా రేపు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. నీకేంటి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్‌లో 100 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. రోడ్డున పడేది ఈ పేదలు అని అన్నారు.
ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదు. ఎఫ్టీఎల్ ఫిక్స్ కాలేదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు. కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా జరగలేదని హరీశ్‌రావు తెలిపారు. అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇందాక ఒక సోదరి మాట్లాడుతూ ‘వి వాంట్ కేసీఆర్ బ్యాక్’ అని అన్నారని.. రాష్ట్రంలో కచ్చితంగా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. అప్పుడు ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని బాగు చేసి చూపిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రేట్లు పడిపోయాయని పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందని.. ఎక్కడ చూసినా దోపిడీయే అని విమర్శించారు. హైడ్రా ముసుగులో దోపిడీ, మూసీ ప్రాజెక్టు విషయంలో దోపిడీ, ఫ్యూచర్ సిటీ పేరిట, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట, భూముల అమ్మకాల పేరిట అంతా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
మేం కేవలం రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మేం మాట్లాడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం భేషజాలకు, పట్టింపులకు పోకుండా.. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్కనే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోవాలని సూచించారు. అంతే కానీ మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను ఛిద్రం చేయకండని హెచ్చరించారు. మా ఇండ్లు కూలగొట్టే బదులు.. మా నీళ్ల ట్యాంకులో విషం కలిపితే మేమంతా తాగి చచ్చిపోతాం.. మమ్మల్ని చంపండి అని ఇక్కడ ఒక తల్లి అన్న మాట నన్ను ఎంతగానో కలచివేసిందని అన్నారు. మీరెవరూ ఆందోళన చెందకండి, భయపడకండని సూచించారు. రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అక్రమాలపై ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పక్షాన మీకు అండగా నిలబడి, చట్టపరంగా పూర్తి స్థాయి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు..