హుజూర్నగర్, మే12 : మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సంప్రదాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర వాదులు అమాయకులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆకస్మికంగా దాడులు చేసి వెళ్లిపోవడం చూశామని, మొదటిసారి మత ప్రాతిపదికన చంపడం జరిగిందని చెప్పారు. హుజూర్‌నగర్‌లో సోమవారం సీపీఐ సీనియర్ నాయకురాలు పశ్య కన్నమ్మ సంతాప సభకు హాజరై మాట్లాడారు. చరిత్రలో కన్నీరు ఎక్కడ వృథాగా పోలేదని, ఇప్పుడు కూడా ఉగ్రవాదాన్ని లేకుండా చేసేందుకు ఆ కన్నీరు కారణమవుతుందని చెప్పారు. దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు టెర్రరిస్టులు దాడులు చేయడం, అమాయకులు బలి కావడంతో దానిని బీజేపీ ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా మలుచుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు.
అమెరికా ఒక వైపు పాకిస్థాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూనే టెర్రరిస్ట్ యాక్టివిటీని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరం ఉందని తెలిపారు. తీవ్రవాద సమస్యకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుందని విమర్శించారు. మతాన్ని, టెర్రరిజాన్ని ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించుకోవడం ఏ మాత్రం తగదన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండూ ఒకే సంవత్సరం ఆవిర్భవించినా దేశం కోసం పోరాడిన చరిత్ర, నిజమైన దేశభక్తి కమ్యూనిస్టులదేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, అక్కినేని వనజ, మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి రజని పాల్గొన్నారు.