అనంతగిరి, జనవరి 17 : ఈ నెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతాభ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం అనంతగిరి మండలంలోని శాంతినగర్లో పార్టీ బహిరంగ సభకు ఇన్స్ట్రక్టర్ మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సేన సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలం నుండి 50 మంది జనసేన కార్యకర్తలకు శిక్షణ ఇప్పించి బహిరంగ సభకు పంపుతున్నట్లు తెలిపారు. ఆదివారం ఖమ్మంలో జరిగే సభకు సుమారు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారనని, లక్షలాది మంది ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొంటున్నారని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్ధం కృష్ణారెడ్డి పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాడకొప్పుల ఉమా లింగయ్య యాదవ్, పార్టీ గ్రామ కార్యదర్శి వీరబాబు, సహాయ కార్యదర్శి నరేశ్, సీనియర్ కామ్రేడ్ లింగయ్య పాల్గొన్నారు.