నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి13(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. నల్లగొండ, మిర్యాలగూడ మినహా మిగతా మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 12 గంటలలోపే ఫలితాలపై స్పష్టత వచ్చింది. మిర్యాలగూడలో మధ్యా హ్నం 2 గంటల వరకు పూర్తి కాగా నల్లగొండలో మాత్రం పూర్తి ఫలితాలు వెలువడే సరికి సాయంత్రం 4 గంటలు దాటింది. నల్లగొండ కార్పొరేషన్లో మేయర్‌కు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటగలిగింది. ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చైర్మన్ పీఠాలను చేజిక్కించుకుంది. నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లకుగాను కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఫా ర్వర్డ్ బ్లాక్ పార్టీ 4, ఎంఐఎం 2, స్వతం త్రులు ఇద్దరు గెలిచారు.
మిర్యాలగూడలో 48 వార్డులకుగాను కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఫార్వర్డ్ బ్లాక్ 1, ఇండిపెండెంట్ ఒక స్థానం గెలుపొందారు. దేవరకొండలో 20 వార్డులకుగాను కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, బీజేపీ 1, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. హాలియాలో 12 వార్డులకు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 స్థానంలో గెలుపొందారు. నందికొండలో 12 వార్డులకు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ ఒకటి స్థానం దక్కించుకున్నాయి. చిట్యాలలో 12 వార్డులకు కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2, ట్రాన్స్‌జెండర్(స్వతంత్ర) ఒకరు గెలుపొందారు. చండూరులో 10 వార్డులకు కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, సీపీఐ 1 స్థానంలో గెలుపొందాయి.

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి బీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం 76,371 ఓట్లు సాధించి 31.80 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. జిల్లా మొత్తం పోలైన ఓట్లు 2,40,174 ఓట్లు కాగా.. ఇందులో కాంగ్రెస్ 1,11,984 ఓట్లు సాధించి 46.63 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల ఓట్లతో పోలిస్తే కాంగ్రెస్ ఓట్లు గణనీయంగా తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. బీజేపీ 24,346 ఓట్లతో 10.14 శాతం సాధించి నామమాత్ర పోటీలో నిలిచింది.
నల్లగొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లలో 40 స్థానాలకుపైగా కాంగ్రెస్‌వే అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. నల్లగొండలో రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలంతా కాంగ్రెస్ వెనకాలే ఉన్నారని పదేపదే చెప్పుకున్నా ఓటర్లు అంతగా పట్టించుకోలేదు. శుక్రవారం నాటి ఫలితాల్లో 27 డివిజన్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో ఒక వార్డు కేవలం 6 ఓట్లతోనే గెలవడం గమనార్హం. మేయర్ పీఠానికి అవసరమైన మ్యాజిక్ 25కు రెండు స్థానాలు మాత్రమే ఎక్కువ సాధించింది. దీంతో ఇప్పుడు ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి అప్పుడే పావులు కదుపుతున్నారు. పలు వార్డుల్లో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇవ్వడంతో పాటు రెబల్స్ కాంగ్రెస్ కొంప ముంచినట్లుగా స్పష్టమవుతోంది. కార్పొరేటర్లను శుక్రవారం రాత్రికే శిబిరానికి తరలించారు.
నల్లగొండ కార్పొరేషన్‌లోని 14 డివిజన్‌ను ముందుగా 6 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి బొజ్జ వెంకటయ్య గెలిచినట్లు ఆర్వో ప్రకటించినట్లు కౌంటింగ్ ఏజెంట్లు తెలిపారు. అంతలోనే పలు ఫోన్లు ఆర్వోకు రావడం తో విజయాన్ని తారుమారు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి బొజ్జ శంకరయ్య గెలిచనట్లు ప్రకటించారని ఆందోళనకు దిగారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రీకౌంటింగ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆందోళనకు దిగారు. ఆర్వోను కలిసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడటంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జేసీ శ్రీనివాసులు, ఆర్డీవో అశోక్‌రెడ్డి బయటకు వచ్చి భూపాల్‌రెడ్డితో మాట్లాడారు. భూపాల్‌రెడ్డి 14వ డివిజన్ ఫలితంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయపరంగా తేల్చుకుంటామని కంచర్ల భూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓట్లను లెక్కించారు. మధ్యాహ్నం వరకు ట్రెండ్ తెలిసిపోయింది. పలు చోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మొత్తం 31 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించారు.
ఓట్ల లెక్కింపులో తొలుత పోచంపల్లి, మోత్కూరు, ఆలేరు మున్సిపాలిటీల్లో అధిక్యత వచ్చినా తర్వాత తగ్గుతూ వచ్చింది. ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లిలో రెండు వార్డుల చొప్పున అతి స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. చౌటుప్పల్‌లోని ఏడో వార్డులో కౌంటింగ్‌లో ఉత్కంఠ నెలకొంది. తొలుత బీఆర్ఎస్ అభ్యర్థి కానుగ యాదమ్మపై కాంగ్రెస్ అభ్యర్థికి రెండు ఓట్ల ఆధిక్యం రాగా, రీకౌంటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా వచ్చింది. మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించడంతో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. పలు చోట్ల బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. మోత్కూరు మినహా అన్ని పురపాలికల్లో ఖాతా తెరిచింది.
ఆలేరులో 12 వార్డులకుగాను కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 3, బీజేపీ 2, భువనగిరిలో 35 వార్డులకుగాను కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, స్వతంత్రులు ఐదుగురు విజయం సాధించారు. చౌటుప్పల్‌లో 20 వార్డులకుగాను కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఒక ఇండిపెండెంట్ విజయం సాధించారు. మోత్కూరులో 12 వార్డులకుగాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. పోచంపల్లిలో 13 వార్డులకుగాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ 1, బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించారు. యాదగిరిగుట్టలో 12 వార్డులకుగాను కాంగ్రెస్ 8, బీజేపీ 2, బీఆర్ఎస్ 1, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
సూర్యాపేట, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 11న జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన విషయం విదితమే. పోలింగ్ అనంతరం ఆయా మున్సిపాలిటీల్లోని బ్యాలెట్ బాక్స్‌లను సూర్యాపేట ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఫలితాలు వెలువడ్డాయి. ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 141 వార్డులకుగాను 36 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది. 91 వార్డులు కాంగ్రెస్, బీజేపీ 1, సీసీఎం 1, సీపీఐ1, స్వతంత్రులు 11 మంది గెలుపొందారు.
సూర్యాపేటలో 48 వార్డులకుగాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 31, బీజేపీ 1, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలుపొందారు. తిరుమలగిరిలో 15 వార్డులకుగాను బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 5, కోదాడలో 35 వార్డులకుగాను బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 27, స్వతంత్రులు 5 మంది గెలిచారు. హుజూర్‌నగర్‌లో 28 వార్డులకుగాను బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 19, సీపీఐ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్లు ముగ్గురు గులిచారు. నేరేడుచర్లలో 15 వార్డులకుగాను బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 9 మంది అభ్యర్థులు గెలుపొందారు. నేరేడుచర్లలో ఐదు వార్డులను బీఆర్ఎస్ సొంతంగా గెలవగా.. ఒక వార్డులో జనసేనకు మద్దతు ఇచ్చి గెలిపించారు. ఇక్కడ మద్యం, డబ్బు ఏరులై ప్రవహించినా బీఆర్ఎస్ పోరాడి ఓడిందనే చెప్పొచ్చు.