నకిరేకల్, అక్టోబర్ 27 : కపాస్ కిసాన్ యాప్‌తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం అలాగే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర మహిళ కన్వీనర్ కందాల ప్రమీల మాట్లాడుతూ.. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన కాపాస్ కిసాన్ యాప్‌తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వం పత్తి కొనుగోలు చేయాలంటే కేంద్రం తీసుకు వచ్చినటువంటి ఈ యాప్ లో రైతు పంట తదితర వివరాలు నమోదు చేయాలని, అలా నమోదు చేసుకోకుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయమనే నిబంధన సరియైనది కాదని విమర్శించారు.
జిల్లాలో ప్రతి రైతుకు స్మార్ట్ ఫోన్ లేదని, స్మార్ట్‌ఫోన్ ఉన్నా సరైన అవగాహన, ఇంటర్ నెట్ తదితర ఇబ్బందులు ఉంటాయని కావునా ఈ యాప్ లో నమోదు చేయాలనే నిబంధనతో సంబంధం లేకుండా వ్యవసాయ అధికారి ఇచ్చే టోకన్ ద్వారా పత్తి కొనుగోలు చేసేలా జిల్లా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు చర్య తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి క్వింటాకు రూ.10,075 చెల్లించాలని, పత్తి కొనుగోలు చేసిన 24 గంటల లోపల రైతు అకౌంట్లో డబ్బులు జమ చేసేలా చూడాలని ఆమె కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులకు సూచించారు. జిల్లాలో వెంటనే వీలైనన్ని ఎక్కువ చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ప్రైవేట్ పత్తి వ్యాపారం నుండి రైతులను కాపాడి మద్దతు ధర చెల్లించే విధంగా కృషి చేయాలన్నారు.
వర్షాల వల్ల తెగుళ్ల వల్ల ఇప్పటికే పత్తి రైతులు తీవ్రంగా నష్ట పోయారని ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల వల్ల పత్తి రంగు మారిందనే సాకుతో ప్రైవేట్ వ్యాపారులు రైతాంగాన్ని దగా చేస్తున్నారన్నారు. కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీసం మద్దతు ధర రూ.10,075/ కచ్చితంగా అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు చెన్నబోయిన నాగమణి, ఒంటెపాక కృష్ణ, రైతు సంఘం నాయకురాలు గురిజ స్వరూప పాల్గొన్నారు.