నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠిన నిబంధనలను సడలించాలన్న విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ గురువారం ప్రకటింటింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సోమవారం నుంచి పూర్తిగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. ఈ ఏడాది పత్తి కొనుగోళ్లపై సీసీ ఐ కక్ష కట్టినట్లుగా వ్యవహారిస్తోంది. రైతులతోపాటు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో కొనుగోళ్లకు కొత్తగా కపాస్ యాప్ పెట్టి అందులో రైతులు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని నిబంధనలు పెట్టారు. ఇక ఒక్క ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామని మరో కఠిన నిబంధనను అమలు చేస్తున్నారు. ఇక వీటికి తోడు జిల్లాలోని అన్ని పత్తి మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఒకేసారి తెరవకుండా దశలవారీగా తెరవాలని ఆదేశాలిచ్చారు. దీని వల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగనుంది. నల్లగొండ జిల్లాతో కలుపుకుని మహబూబ్‌నగర్ జోన్ పరిధిలో మొత్తం 38 సీసీఐ కేంద్రాలు తెరవాల్సి ఉండగా నేటికీ 23 కేంద్రాలనే అందుబాటులోకి తెచ్చారు. ఇక నల్లగొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిని ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5 గా విభజించారు. ఇందులో ప్రస్తుతం ఎల్1, ఎల్2 కేంద్రాలను మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచారు.
మిగతా కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయడం లేదు. వీటిల్లో కొనుగోలు సామర్ధ్యం పూర్తయ్యాకే మిగతా వాటిని తెరవాలంటూ సీసీఐ ఆంక్షలు విధించింది. దీంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దశలవారీగా ఏ కేంద్రాలైతే తెరుస్తారో అక్కడ మాత్రమే రైతులు పత్తిని అమ్ముకునేందుకు స్లాట్ బుకింగ్స్‌కు అనుమతిస్తారు. మిగతా సీసీఐ కేంద్రాలను తాత్కాలికంగా పక్కన పెడతారు. సీసీఐ కేంద్రాలు తెరిస్తేనే నిత్యం ఆందోళనలు తప్పవు. పత్తి కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదని, తేమ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా సీసీఐ ఆదేశాలతో కాటన్ మిల్లు యాజమాన్యాలకు సైతం నిత్యం పత్తి రైతులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే సమయంలో పత్తి రైతులకు ఈ నిబంధనలు ఉరితాళ్లుగా మారతాయన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈనెల 17 నుంచి రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. వాస్తవంగా ఈనెల 6వ తేదీ నుంచే కొనుగోళ్లు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటిస్తే బీహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి అందుబాటులో లేరని, కొద్దీ సమ యం ఇవ్వాలని అధికారులు విజ్ఙప్తి చేశారు. దీంతో తమ మూసివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత కూడా వీరి ఆందోళనను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతూ కొనుగోళ్ల నిలిపివేతకు సిద్ధ్దమైనట్లు అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. కొనుగోళ్ల నిలిపివేత అంశంపై గురువారం నుంచి అన్ని కేంద్రాల వద్ద మూసివేత ప్లెక్సీలను సైతం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ తీరును సరిదిద్ది పత్తి కొనుగోళ్లు కొనసాగేలా చూడాలని రైతులు, రైతుసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారు.