సూర్యాపేట, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : జిల్లా వైద్యారోగ్యశాఖకు అవినీతి రోగం పట్టుకుంది. ఇటీవల ఓ సస్పెండ్ అయిన ఉద్యోగికి సగం జీతం ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి రావడం తెలిసిందే. అలాగే ప్రసూతి సెలవులు తీసుకునేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉద్యోగులను టార్గెట్ చేసిన వారి వేతనాలు దండుకుంటుండడంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఈ శాఖలో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు లేవు. దాంతో వారు సెలవులు పెడితే క్రమబద్ధీకరణ సమయంలో సర్వీస్ బ్రేక్ నిబంధన అడ్డు వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమందికి అక్రమ డిప్యూటేషన్లు ఇవ్వడం, మరికొందరిని పని చేసే చోటే మేనేజ్ చేయడం చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నట్లు తెలుస్తున్నది. గత నాలుగేండ్లలో దాదాపు 21 మంది నుంచి ఇలా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఏ(ఆడ)లకు నిర్ధిష్ట ఉద్యోగం తప్ప వేరే ఇతర విధులు చేయడానికి వర్క్ ఆర్డర్లు ఇవ్వవద్దని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నుంచి స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. దాంతో ఆయా ఏఎన్ఎంలు, ఎంపీహెచ్ఏలు పని చేసే గ్రామాల్లో ఆరోగ్య సేవలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. గతంలో ఆత్మకూర్.ఎస్ మండలంలో పని చేసిన ఓ ఏఎన్ఎం గర్భం దాల్చిన సమయంలో ప్రసూతి సెలవుల కోసం జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారికి కలిశారు.
జిల్లా కార్యాలయంలో అధికారికి సన్నిహితంగా ఉండే ఒకరు ‘నువ్వు సెలవు పెట్టుకుంటే క్రమబద్ధీకరణ సమయంలో ఆటంకాలు వస్తాయి. డిప్యూటేషన్‌పై జిల్లా కార్యాలయానికి బదిలీ చేయిస్తాం. అధికారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నీకు వచ్చే నెలనెలా వేతనాన్ని మాకు ఇస్తే చాలు. సర్వీస్ బ్రేక్ కాదు’ అని చెప్పడంతో ఆమె కూడా అంగీకరించారు. ఇలా ఐదు నెలల పాటు వేతనం పడడమే ఆలస్యం నెల నెలా ఆమె వద్దకు వెళ్లి తీసుకున్నట్లు విశ్వసనీయం సమాచారం. కార్యాలయం రిజిస్టర్లో పేరు ఉండకుండా, అటెండెన్స్ లేకుండా, విధులు నిర్వర్తించకుండానే జీతం వస్తుండడం, వాటిని కార్యాలయం అధికారి పేరు చెప్పి వచ్చి తీసుకువెళ్తుండడం నచ్చని సదరు ఏఎన్ఎం ఏకంగా జాబ్‌కు రిజైన్ చేసినట్లు కార్యాలయం వర్గాల ద్వారా తెలిసింది.
మరో ఘటనలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్న ఓ ఏఎన్ఎం టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వోద్యోగం రావడంతో అటు వెళ్లారు. అయినప్పటికీ ఆరు నెలల పాటు ఆమె పేరుతో జీతం అకౌంట్లో వేసి నెలనెలా కాజేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో తీసుకున్న డబ్బులన్నీ సదరు ఉద్యోగినికి ఇచ్చి రిటర్న్ చేయించినట్లు కార్యాలయం సిబ్బందే మాట్లాడుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు సెలవులు పెట్టకుండానే ఉద్యోగాలు చేయకున్నా మేనేజ్ చేయడం, కొంతమందిని డిప్యూటేషన్లపై జిల్లా కేంద్ర కార్యాలయానికి తెచ్చి కాగితాలపైనే డ్యూటీలు చేయించడం వంటివి చేస్తున్నారు.
గత నాలుగేండ్లలో దాదాపు 21కి మంది నుంచి ఇలా దాదాపు రూ.22 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఉన్నతాధికారికి తెలిసే జరిగాయని, ఆయన సలహాలు, సూచనలతోనే ఈ అక్రమాలు జరగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ చేపడితే అక్రమాలు వెలుగులోకి వస్తాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి తెలిపారు. కాగా, ఈ అక్రమాలపై పూర్తి ఆధారాలతో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్-హైదరాబాద్, ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.