బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల లేమితో పాటు వసతులు లేకపోవడంతో అనేక కళాశాలలకు జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆయా కళాశాలల్లోని కాంట్రాక్టు ప్రొఫెసర్లకు రెన్యువల్ చేయకపోవడం గమనార్హం.
సూర్యాపేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది మార్చి పూర్తయిన వెంటనే రెన్యువల్ చేసి నెలనెలా వేతనాలు చెల్లించేంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర నెలలైనా స్పందించకపోవడం విడ్డూరం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంతా కలిపి దాదాపు 90 మందికి పైగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తప్ప వేరే కళాశాలలు లేవు. దీంతో మెడికల్ విద్య పూర్తి చేసి డాక్టర్ కావాలంటే కనీసం కోటి రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద, మధ్య తరగతి వర్గాల కోసం ఒక్కో జిల్లాకు రూ.500 కోట్లు వెచ్చించి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీంతో ఇటీవల సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కళాశాలల నుంచి 300ల మందికి పైగా వైద్య విద్యార్థులు డాక్టర్లుగా పట్టాలు పొంది బయటకు వచ్చారు. అలాంటి మెడికల్ కళాశాలలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయల కల్పించడంలో విఫలమైంది. దీంతో నిబంధనలు పాటించడం లేదంటూ సూర్యాపేట, నల్లగొండ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 మెడికల్ కళాశాలల నిర్వహణను తప్పుపడుతూ హెల్త్ సెక్రటరీతో పాటు డీఎంఈకి నోటీసులు జారీ చేసి, ఈ నెల 26న విచారణకు రావాలంటూ జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయా కళాశాలల కొనసాగింపు పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు మెడికల్ కళాశాలల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లను మళ్లీ కొనసాగిస్తూ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కళాశాలల్లో 150 చొప్పున 300 మెడికల్ సీట్లు, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 సీట్లు ఉన్నాయి. అలాగే మూడు కళాశాలల్లో కలిపి దాదాపు 90 మందిని గత ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూ ట్ చేసింది. ప్రొఫెసర్లకు రూ.2 లక్షల వేతనం ఇవ్వగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.1.25 లక్షల వేతనాలు ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం డీఎంఈ ఆధ్వర్యంలో మార్చి చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ తొలి వారంలో వీరిని రీ రిక్రూట్ చేసేవారు. ఐదేళ్లుగా సజావుగా నడుస్తున్న మెడికల్ కళాశాలల్లో ఇటీవల జాతీయ వైద్య మండలి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి మౌలిక వసతులు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అలాగే రెండున్నర నెలలు గడుస్తున్నా ప్రొఫెసర్లకు రెన్యువల్ చేయలేదు. అసలు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను కొనసాగించాలని అనుకుంటోందా లేక మూసి వేయాలనే ఆలోచనలో ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.