మహబూబ్నగర్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమస్యపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడన్న అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడిన ఘటన సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో చోటుచేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్పేటలో ఓ ఇంటి వద్ద యజమాని అనుమతి లేకుండా ఇంకుడు గుంత నిర్మిస్తున్నారని గ్రామ వాట్సాప్ గ్రూపులో మంగళవారం రాత్రి పెట్టిన పోస్టుకు స్పందించిన పలువురు రీపోస్టుతో చర్చించారు. ఇది ముమ్మాటికీ అక్రమమే అని బీఆర్ఎస్ కార్యకర్త బాలరాజు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతో గ్రూపు సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. బుధవారం ఉదయం తన ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో బాలరాజు నిలబడి ఉండటాన్ని గమనించిన సర్పంచ్ మౌనిక భర్త హరీశ్గౌడ్తో పాటు 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అతడి వ ద్దకు వెళ్లి బెదిరించి దాడి చేశారు. భయంతో బాలరాజు సమీపంలోని స్కూ ల్ భవనంపైకి ఎక్కి కిందికిదూకగా అతడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. బీఆర్ఎస్ నాయకులు అతడిని దవాఖానకు తరలించారు. సీఎం ఇలాకాలో అరాచక పర్వం నడుస్తున్నదని, రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సమస్యలపై నిలదీస్తే.. దాడులకు దిగుతారా అని మండిపడ్డారు.