యాదగిరిగుట్ట, జూన్ 16 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కాంట్రాక్టు ఉద్యోగులదే హవా. వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. అంతర్గత బదిలీలు వారికి వర్తించవు. విధులకు రాకపోయిన వారికి వేతనం ఇవ్వాల్సిందే. లేకపోతే దేవస్థానం అధికారులు ఎలా ఉద్యోగం చేస్తారో చూస్తామంటూ వార్నింగ్‌లు. వీరేం చేస్తారో చూద్దాం అంటూ దేవస్థానం అధికారులు అంతర్గత బదిలీలు చేయాలని ప్రయత్నిస్తే చాలు. వారికి అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ వస్తోంది. వారు విధులకు వచ్చినా రాకపోయినా, వారిని ఎమన్నా అన్నారంటే సారు లైన్లోకి వచ్చి వార్నింగ్ ఇస్తారు. దేవాదాయ శాఖ ఉన్నతస్థాయి అధికారులకు భయపడాల్సిన అధికారులు ఇప్పుడు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ఉద్యోగాలు ఇప్పించాలి కానీ, ఇలా విధుల్లో సైతం తలదూర్చి దేవస్థాన అధికారులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగం చేయాలంటే భయమేస్తోందని పలువురు అధికారులు బహిరంగగానే ప్రకటించడం గమనార్హం.
గతేడాది జూలైలో దేవస్థాన సీనియర్ అసిస్టెంట్ రాజేందర్‌పై స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి సిఫార్సుతో మహేశ్ అనే కాంట్రాక్టు ఉద్యోగి ఫోన్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అంతర్గత స్థాన చలనం చేసినందుకు దేవస్థాన అధికారిపై దురుసుగా ప్రవర్తించారు. నేను అధికార పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి తాలుకానని, నువ్వు నన్ను ఎలా బదిలీచేస్తావో చూసుకుంటా.. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారడంతో అ కాంట్రాక్టు సిబ్బందిని పాతగుట్ట ఆలయానికి బదిలీ చేసిన సంగతి విదితమే. ఇటీవల కొండకింద సత్యనారాయణ వత్ర మండపంలో కొన్నెండ్లుగా విధుల్లో ఉంటున్న ఓ ఔట్ సోర్సింగ్ మహిళను నిత్యన్నదాన సత్రానికి అంతర్గత స్థాన చలనం చేయగా అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడు ఫోన్ చేసి అధికారికి మాస్ వార్నింగ్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. బదిలీ చేసే ఊరుకునేది లేదని తేల్చి చెప్పిన్నట్లు సమాచారం. దీంతో చేసేదేమీలేక అంతర్గత బదిలీని నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా దేవస్థానంలో అన్ని విభాగాల్లో ఇదే తీరు కొనసాగుతుందని, ఫలానా తాలుకా అని చెబితే చాలు వారిని మందలించేందుకు సైతం అధికారులు జంకుతున్నారు.
రాష్ట్ర తొలిసీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని రూ.1300 కోట్లతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి విభాగాన్ని వేర్వేరుగా అద్భుత నిర్మాణాలు జరిగాయి. దీంతో మరింత మంది ఉద్యోగులు కావాల్సి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే యాదగిరిగుట్ట కొండపైన వివిధ సెక్షన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకోవాలని దేవస్థానానికి సూచించింది. ఈ నియామకాల్లో చేసేందుకు దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు టెండర్ ద్వారా పిలిచింది. ఈ టెండర్లో హైదరాబాద్‌కు చెందిన సురక్ష సెక్యూరిటీ సర్వీసెస్ దక్కించుకోగా 2022 అక్టోబర్ నుంచి సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఉద్యోగుల నియామకం, జీతభత్యాలు అందిస్తోంది. తాజాగా ఏజెన్సీ మారడంతో ప్రస్తుతం కృష్ణ కన్‌స్ట్రక్చన్, గ్లోబల్ సర్వీసెస్ ఏజెన్సీలతో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా 480 మంది సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిన కొండపైన వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ హయాంలో నియమించిన కొంత మంది అకారణంగా తొలిగించి ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి తన పార్టీకి చెందిన నాయకులు, అనుచరులకు చెందిన వారినే నియమించేలా దేవస్థానంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
480 మందిలో సుమారుగా 240 మందిపై చిలుకు సదరు ప్రజాప్రతినిధి నియమించినవారే ఉన్నారని తెలుస్తోంది. అప్పటి నుంచి వీరు ప్రధాన దేవాలయం, ప్రొటోకాల్, లడ్డూ ప్రసాదాల విభాగం, సానిటేషన్, సత్యనారాయణ వత్ర మండపం, నిత్యన్నదాసత్రంతో పాటు గోదాంలలో నియమించారు. దేవస్థాన నిబంధనలు ప్రకారం ప్రతి 15 రోజులు లేక, నెల, మూడు నెలలకోసారి అంతర్గత స్థాన చలనం చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకోసారి స్థాన చలనం చేశారు. కానీ ప్రస్తుతం ఇందుకు భిన్నంగా దేవస్థానం ఆ ప్రజాప్రతినిధి రూల్‌లో అమలు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. స్వామివారి ప్రధానాలయం, ప్రొటోకాల్, లడ్డూ ప్రసాద విక్రయశాల, వ్రత మండపం, గోదాంలలో ఏండ్లకొద్దీ వారే కొనసాగుతున్నారని తెలుస్తోంది. దీంతో అవినీతి ఘటనలతో పాటు దేవస్థాన అధికారులు పాలన పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తలలు పట్టుకుంటున్నారు. ఏండ్లకొద్దీ ఒకే చోట ఉండటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ఆలయ నిబంధనలను తూట్లు పొడుస్తున్నారు.
దేవస్థాన కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ప్రమేయం మితిమీరిపోయింది. చీటికిమాటికీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల అంతర్గత బదిలీపై జోక్యం చేసుకొని దేవస్థాన అధికారుల విధులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాడు. మేం ఏం చెబితే అదే జరగాలంటూ, మీ ఇష్టంవచ్చిన్నట్లు ప్రవర్తిస్తే బదిలీ వేటు తప్పదని మాస్ వార్నింగ్‌లు ఇవ్వడంతో అధికారులు నోరు మెదపటం లేదు. మేం నియమించిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది జోలికి రావొద్దని, వారికి అదేస్థానంలోనే విధులను కొనసాగించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఉద్యోగ నియామకంతోపాటు ప్రతి చిన్న విషయానికి ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడి తలదూర్చడంపై అధికారులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు దేవస్థాన అంతర్గత బదిలీలను పట్టించుకోలేదని, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అనంతరం ప్రతి చిన్న అంశంలో రాజకీయ నాయకుల జోక్యంతో రెచ్చిపోవడంతో ఇబ్బందిగా మారిందని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.
దేవస్థాన అధికారుల అంతర్గత స్థాన చలనం లో నూతన విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దేవస్థానం అన్ని విభాగాల్లో కాంట్రాక్టు సిబ్బందికి అవగాహన రావడంతోపాటు అవినీతికి చెక్ పెట్టాలన్న సంకల్పంతో ఆన్లైన్ జంబ్లింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రతి నెల, లేక 15 రోజులకోసారి దేవస్థాన అధికారులతోపాటు, అన్ని విభాగాల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్థానచలనం చేసేందుకు ఆన్లైన్ జంబ్లింగ్ పద్ధతిని దేవస్థానం ప్రవేశపెడుతున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ సాప్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయిన్నట్లు త్వరలో అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.