ప్రస్తుత వానకాలం సీజన్లో వరుణుడి కరుణ కొంత ఆలస్యమైనా మూడు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి పలుకరింతకు సర్కార్ చేయూత తోడవడంతో సాగుకు రైతన్న సిద్ధమయ్యాడు. రైతులు మెట్ట ప్రాంతాల్లో పత్తి విత్తనాలు విత్తే పనిలో బిజీ అయ్యారు. నాన్ ఆయకట్టులో బోర్లు, బావుల కింద ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు పొలాలు తడిపే పనిలో నిమగ్నమయ్యారు. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో పల్లెల్లో సాగు సందడి కనిపిస్తున్నది. మరోవైపు వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్ సర్కారు రైతులకు అన్ని రకాల సహకారాలకు సర్వం సిద్ధమైంది. వ్యవసాయ ప్రణాళికకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక పెట్టుబడి సాయం రైతుబంధు డబ్బును ఈ నెల 26నుంచి ఇచ్చేందుకు రెడీ అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో సుమారు 11 లక్షల మంది రైతులకు రూ.1300 కోట్లు అందించనున్నది. ఇదే సమయంలో రైతులను కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువుల పేరుతో నష్ట పర్చాలని చూస్తే కఠిన చర్యలకు ఆదేశించింది. దాంతో ఇప్పటికే నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. మరోవైపు సరైన సమయంలో ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదలపైనా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, జూన్ 23 (నమస్తే తెలంగాణ)
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానకాలం పంటల సాగు షురూ అయ్యింది. మెట్ట, తరి భూముల్లో రైతులు వ్యవసాయానికి ఉపక్రమించారు. మెట్ట ప్రాంతాల్లో పత్తి సాగులో రైతులు బిజీ అయ్యారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసినవారు విత్తనాలు వేయడం ఆరంభించారు. ఇక నాన్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావుల కింద వరి సాగు పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో వానకాలం సీజన్లో సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారులు గత నెలలోనే రూపొందించారు. ప్రభుత్వ ఆమోదంతో దాన్ని ఆచరణలో పెట్టారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ వానకాలంలో నల్లగొండ జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 11,93,000 ఎకరాల్లో సాగు అవుతాయని అంచనా వేశారు. ఇందులో వరి, పత్తి పంటలదే అగ్రస్థానం. పత్తి 6.50 లక్షల ఎకరాల్లో, వరి 5.25 లక్షల ఎకరాల్లో, ఆ తర్వాత కందులు 10వేలు, వేరుశనగ 3వేలు, పప్పు దినుసులు 2వేల ఎకరాలు, ఇతర పంటలన్నీ కలిపి మరో 3వేల ఎకరాల్లో సాగు కావచ్చని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. గత వానకాలంలో అన్ని పంటలు కలిపి 11,54,286 ఎకరాల్లో సాగయ్యాయి. ఈసారి అదనంగా మరో 39వేల ఎకరాల్లో సాగు కావచ్చని భావిస్తున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, జూన్ 23 (నమస్తే తెలంగాణ)
రామగిరి, జూన్ 23 : నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజూ వర్షం కురిసింది. శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అత్యధికంగా నకిరేకల్‌లో 44.1 మి.మీ. వర్షం కురువగా.. అతి తక్కువగా గుండపల్లి (డిండి)లో 0.1 మి.మీ. వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కనగల్ మండలంలో 43.6 మి.మీ., తిరుమలగిరి సాగర్‌లో 38.4, చింతపల్లిలో 28.8, మర్రిగూడలో 28.0, నాంపల్లిలో 27.2, నార్కట్‌పల్లిలో 26.5, శాలిగౌరారంలో 25.5, కట్టంగూర్‌లో 21.7, నిడమనూరులో 20.9, చిట్యాలలో 18.0, దేవరకొండలో 16.4, కేతేపల్లిలో 14.9, అనుములలో 14.1, పెద్దవూరలో 14.1, మునుగోడులో 13.8, అడవిదేవులపల్లిలో 13.2, దామరచర్లలో 12.9, నల్లగొండలో 11.5, త్రిపురారంలో 10.9, చండూరులో 9.5, మిర్యాలగూడలో 8.9, తిప్పర్తిలో 8.4, కొండమల్లేపల్లిలో 7.9, వేములపల్లిలో 5.7, నేరేడుగొమ్ములో 4.0, గుర్రంపోడులో 2.6, చందంపేటలో 1.9, మాడ్గులపల్లిలో 1.5, గుండప్లలి మండలంలో 1.5 మి.మీ. వర్షం పడింది.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట, జూన్ 23 : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా నాగారం మండలంలో 4.5 సెంటీమీటర్ల వర్షం పడగా, మద్దిరాలలో 3.2, మోతె, తిరుమలగిరి మండలాల్లో 2.7, పెన్‌పహాడ్, హుజూర్నగర్, నేరేడుచర్ల మండలాల్లో 2.2, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, చిలుకూరు, చివ్వెంల మండలాల్లో 2 సెంటీమీటర్ల వాన పడింది. నూతనకల్, మునగాల, గరిడేపల్లి, మఠంపల్లి మండలాల్లో 1.4 సెంటీమీటర్లు, మిగతా మండలాల్లో సెంటీమీటరుకు పైగా వర్షం కురిసింది.
జిల్లాలో ఈ సీజన్లో అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. మొత్తంగా అవసరాన్ని బట్టి విడుతల వారీగా జిల్లాకు తెప్పిస్తున్నారు. విత్తనాలకు సంబంధించి 6.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకుగాను 14.5 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశారు. వరి విత్తనాలు ఈ సీజన్లో అన్ని రకాల వెరైటీలు కలిపి 86,450 క్వింటాళ్లు అవసరమని అంచనా వేశారు. విత్తనాల విక్రయాల దుకాణాల్లో అందుబాటులో ఉండగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిపాడ్ సీడ్ కార్పొరేషన్ సంస్థలో ప్రస్తుతం 8,807 క్వింటాళ్లు ఉన్నాయి. వర్షాలను బట్టి సాగు అవసరాలకు అనుగుణంగా మిగతావి విడుతల వారీగా రానున్నాయి. మెట్ట పంటలైన కందులు 600 క్వింటాళ్లు, పెసర్లు 400 క్వింటాళ్లు, వేరుశనగ వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించిన ఎరువుల అవసరాలపైనా దృష్టి సారించారు. యూరియా 80,108 మెట్రిక్ టన్నులకుగాను 27,462 మెట్రిక్ టన్నులు, డీఏపీ 14,377 మెట్రిక్ టన్నులకుగాను 4,544, ఎంఓపీ 11,745 మెట్రిక్ టన్నులకుగాను 1,578, కాంప్లెక్స్ ఎరువులు 1,09,379 మెట్రిక్ టన్నులకుగాను 27,183 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. పంటల సాగుకు అనుగుణంగా అవసరాలను బట్టి మిగతా ఎరువులను విడుతల వారీగా జిల్లాకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.
ఆలస్యమైనా.. సమృద్ధిగా వర్షాలు
నైరుతి రుతుపవనాల రాక కొంత ఆలస్యమైనా.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు భారీగా కురిస్తే పూర్తి స్థాయిలో పంటలు సాగు కానున్నాయి. ఇదే సమయంలో సాగర్ ఎడమ కాల్వ, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులోనూ సాగునీటి విడుదలపైనా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏటా మాదిరిగానే నీటి లభ్యతను బట్టి తొలుత నారుమళ్లకు, ఆ తర్వాత వరి నాట్లకు నీటిని విడుదల చేయనున్నారు. దాంతోపాటు మూసీ, ఏఎంఆర్పీ ఆయకట్టుకు సైతం నీటిని విడుదల చేయనున్నారు.
రైతుబంధుకు వేళాయె..
దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం సకాలంలో అందజేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఇప్పటికే పది దఫాలుగా సాయాన్ని అందజేసిన సర్కార్ 11వ సారి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16 వరకు పట్టాదారు పాసుపుస్తకం పొందిన ప్రతి రైతుకూ వర్తింపజేసేలా ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే సరి చేసుకోవాలని సూచించింది. దాంతో అన్ని గ్రామాల్లోనూ వ్యవసాయ శాఖ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో 11 లక్షల మందికి పైగా రైతులకు రూ.1300 కోట్ల వరకు నగదు జమ కావచ్చని అంచనా. 2022 వానకాలంలో రైతుల సంఖ్య 10.54లక్షలు కాగా, యాసంగిలో 10.81లక్షల మందికి చేరింది. ఈ సారి మరింత పెరిగి 11 లక్షలు దాటుతుందని అంచనా. ఈ నెల 26వ తేదీ నుంచి ఎకరానికి ఐదు వేల చొప్పున నగదు రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఎక్కడా పైసా అవినీతికి తావులేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుండడం విశేషం.
కల్తీలపై నిఘా తీవ్రతరం
సీజన్ ప్రారంభంలో ప్రతి ఏటా కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు చలామణిలోకి రావడం సర్వసాధారణంగా ఉండేది. కానీ.. స్వరాష్ట్రంలో వీటి విషయంలోనూ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ కల్తీ విషయంలో చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కల్తీ విత్తనాలు, ఎరువులను పట్టుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని, ఎక్కడైనా దొరికితే వారిపై పీడీయాక్టులు పెట్టి జైళ్లకు పంపాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే నల్లగొండ జిల్లాలో నకిలీ విత్తనాలపై పలు కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేశారు.