– కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ కార్యకర్తలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నేతలు పరామర్శ
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ప్రజల్లో వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ పెరిగిపోతుందని దాని ఫలితమే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, పోలింగ్ బూత్ల ఆక్రమణ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడి నల్లగొండలోని ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు జమీల్, మస్తాన్ లను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహరెడ్డి, సీపీఎం నేతలు తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. బుధవారం రాత్రి హాస్పిటల్కు చేరుకున్న నేతలు వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సభ్యులకు ధైర్యం చెప్పి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలను కవర్ చేసుకునేందుకు దాడులకు పాల్పడ్డారని, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ఇలా చాలా చోట్లా కాంగ్రెస్ నాయకులు దాడులకు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. పోలీసులు సైతం కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారని ఆరోపించారు. జిల్లా అధికారులు నిస్సాహాయులుగా చూస్తు ఉండిపోయారన్నారు. ఎన్నికల సంఘం కూడా తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ గా మారిందన్నారు. ఇతర పార్టీల ఫిర్యాదులపై కనీసం స్పందించడం లేదన్నారు.
ప్రతీ చోట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బూత్ లు ఆక్రమించే ప్రయత్నం చేస్తే ఎన్నికల అధికారులకు కనీసం పట్టింపు లేదని దుయ్యబట్టారు. డబ్బు, అధికారం విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని, చివరకు దాడులకు పాల్పడుతూ అరాచకాలకు తెగబడ్డారన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్కు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, కాంగ్రెస్ పతనం మొదలైంది అనే దానికి భౌతిక దాడులే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.

ప్రజా వ్యతిరేకతతో నిరాశలోకి కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి