చండూరు, జనవరి 30 : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో “ఆల్ ఈజ్ వెల్” అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితి తలకిందులైంది. చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ (బీ-ఫామ్) దక్కలేదన్న మనస్థాపంతో ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని, కార్యకర్తలంతా ఏకతాటిపై ఉన్నారని గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన వెలువడిన మరునాడే చండూరు మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీలోని అసమ్మతిని బట్టబయలు చేసింది. ఆత్మహత్యాయత్నం చేసిన వేణు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సంసిద్ధం కాగా బీ-ఫామ్ దక్కకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.