సూర్యాపేట, ఫిబ్రవరి 05 : కాంగ్రెస్ పార్టీది బాగు చేసే పని కాదని చెడగొట్టే పని అని, కేసీఆర్ వస్తే బాగుండని ప్రజలంతా బలంగా అనుకుంటున్నారని, పదేళ్లలో చేసిన అభివృద్ధిని కొనియాడుతున్నారని, పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని రెండేళ్ల కాంగ్రెస్ నాయకులు ఆగం చేస్తున్నరన్నారు. అభివృద్ధితో పాటు పదేండ్లలో పెంచిన పచ్చదనాన్ని ఎండబెడుతున్నారని, కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు భావిస్తున్నారన్నారు. మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండని కాంగ్రెస్ మాయగాళ్లను నమ్మినందుకు నట్టేట ముంచారన్నారు.
మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలని మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్‌ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి కేరఫ్‌గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అందరికి జ్ఞానం పెరుగుతది.. కానీ రేవంత్ కు ఉన్న ఆ కాస్త జ్ఞానం సైతం పోయిందన్నారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా కాకుండా దిగజారి మాట్లాడుతుండని, సమస్యల మీద మాట్లాడకుండా బూతులు వల్లెవేస్తున్నడన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అర్ధం లేని ఆరోపణలు సరికాదన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలు కప్పిపుచ్చేలా రోత మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ ఇజ్జత్ పోతుందన్నారు.
గాంధీలా ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణ తెచ్చాడన్నారు. స్వాతంత్య్రం తెచ్చిన గాంధీతో పొలుస్తూ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని ప్రజలు జాతిపిత అంటున్నారన్నారు. రేవంత్ గతంలో చంద్రబాబు, నేడు సోనియాలే జాతిపితలని భవిష్యత్‌లో మోదీ కూడా జాతిపిత అవుతాడేమో అన్నారు. రేవంత్ అజ్ఞానంతో జ్ఞానం ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, నల్లగొండ జిల్లా పర్యటనలో నిబంధనలకు వ్యతిరేకంగా రేవంత్ శంకుస్థాపనలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఎం జిల్లాకు వస్తే ఏదో ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తారని కానీ స్థాయి పెరిగినా అవే బూతులు అర్థంలేని ఆరోపణలన్నారు. సీఎంగా రెండేళ్లు గడిచినా రోజురోజుకు సంస్కారహీనత పెరిగిపోతుందని, ఉన్న సమస్యలను పక్కనపెట్టి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ సభల్లో ఆయన రోత మాటలతో బీఆర్ఎస్ కు మరింత బలం పెరుగుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ది చెడగొట్టే పని తప్ప బాగు చేసే పని కాదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి