రాంచీ, ఆగస్టు 18: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(జేఎస్ఎస్సీ) పరీక్షలో అవినీతి రహిత నియామకాల కోసం త్వరలో తన నిరసన రెండవ దశను ప్రారంభిస్తానని జేఎల్కేఎం నాయకుడు దేవేంద్ర మహతో మంగళవారం ప్రకటించారు. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు చేయడంతో 16 రోజుల పాటు సాగిన తన నిరాహార దీక్షను విరమించిన సందర్భంగా మహతో రాంచీలో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో నియామక పరీక్షల్లో అవకతవకలు జరగవని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ఈ నిరసన కొనసాగుతుందని ఆయన అన్నారు.
నేను నా నిరాహార దీక్షను విరమించాను. కానీ నిరసనను కాదు. నియామక పరీక్షల్లో పేపర్ లీక్ లేదా అవకతవకలు జరగవని ప్రభుత్వ హామీ ఇచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవినీతి రహిత నియామకాలను డిమాండ్ చేస్తూ త్వరలో మా నిరసన రెండవ దశను ప్రారంభిస్తాము అని మహతో అన్నారు. మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ అభ్యర్థి సంస్కరణ వేదిక ఆధ్వర్యంలో ఈ ఆందోళన రెండవ దశ ప్రారంభం కానున్నది. 2014 నుంచి ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్ష సహా అన్ని నియామక పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో 16 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన మహతో సోమవారం అర్ధరాత్రి తన దీక్షను విరమించారు.