ముంబై, ఆగస్టు 18: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. పశ్చిమాసియాలో దౌత్యపరమైన పురోగతికి సంబంధించి ఆశలు క్షీణించడం పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీసింది. ఫలితంగా మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మంగళవారం కూడా భారీగా నష్టపోయింది. క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం కూడా నష్టాలను మరింత పెంచాయి.
ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 492.70 పాయింట్లు కోల్పోయి 77,235.46 వద్ద స్థిరపడింది. సూచీలు వరుసగా నష్టపోవడం ఇది మూడోసారి. అలాగే మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ వరుసగా ఆరోరోజూ 132.75 పాయింట్లు నష్టపోయి 24,154.90 వద్దకు జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 91 డాలర్లు దాటడం మదుపర్లలో ఆందోళన నెలకొన్నదని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
టాటా గ్రూపునకు చెందిన కంపెనీల షేర్ల పతనం కొనసాగింది. టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ షేరు 2.28 శాతం నష్టపోగా, టాటా కెమికల్స్ 1.63 శాతం, టీసీఎస్ 1.47 శాతం, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 1.25 శాతం, వొల్టాస్ 1.10 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 1 శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి. వీటితోపాటు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా స్టీల్, టైటాన్, టాటా పవర్, ట్రెంట్ షేర్లు కూడా పతనం చెందాయి. టాటా సన్స్ ఏజీఎం కోరం లేకపోవడంతో ఏజీఎం వాయిదాపడటం షేర్ల పతనానికి ప్రధాన కారణం.