మునుగోడు, మే12 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఇన్చార్జి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దళితులకు ఆర్థిక, సామాజిక న్యాయం చేస్తామని అన్నారు. కానీ ఎక్కడ కూడా దళితులకు న్యాయం జరుగుతలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కూడా దళితులకు న్యాయం జరగలేదన్నారు.
నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. ప్రతి గ్రామంలోని ఒక బూత్ కు ఎనిమిది ఇందిరమ్మ ఇండ్లను మాత్రమే మంజూరు చేశారన్నారు. గ్రామాలలో దళితులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. రాజీవ్ యువ వికాస పథకంలో దళితులకు ఎలాంటి షరతులు లేకుండా ఆరులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాపల శీను, గోస్కొండ లింగయ్య, దుబ్బ వెంకన్న, ఈదులకంటి కైలాస్, ముత్యాలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.