సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 19 : ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయం పండుగలా మారింది.. నిరంతర విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి సాయంతో నేను రైతును అని చెప్పుకొనే రీతిలో జీవన చిత్రం మారింది.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే.. రేపటి గురించి ఆలోచించే గొప్ప దార్శనికుడు మన సీఎం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్‌తోపాటు 250 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. అలాగే ఆత్మకూర్. ఎస్ మండలానికి చెందిన పాత సూర్యాపేట, కందగట్ల గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నుంచి 200 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకూ కావాలని దేశవ్యాప్తంగా ప్రజలు కాంక్షిస్తున్నారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్తో పెనుమార్పులు చోటుచేసుకుంటాయనే నమ్మకంతో ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలస వస్తున్నారని అన్నారు.
2014కు ముందు కరెంట్ కోతలు, నీటి కొరత, పంటలు పండక పొట్టకూటికి వలసవెళ్లిన పరిస్థితుల నుంచి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పండుగలా వ్యవసాయం కొనసాగుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన సమక్షంలో సూర్యాపేట మున్సిపాలిటీ 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్‌తో 250మంది నాయకులు, కార్యకర్తలు, ఆత్మకూర్ (ఎస్) మండలానికి చెందిన పాత సూర్యాపేట, కందగట్ల గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు 200మంది బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ముందు చూపున్న గొప్ప దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో మరే పార్టీ, నాయకుడికి సీఎం కేసీఆర్ లాంటి విజన్ లేదని, అందుకే యావత్ దేశం ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు.
నాడు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్ని రంగాలను అభివృద్ధి చేసిన విధంగానే బీఆర్ఎస్తో దేశాభివృద్ధిలో పెను మార్పులు రానున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ వచ్చాకే రాష్ట్రంలో ఆకలి చావులు పోయాయని, అదే మాదిరి దేశంలో దరిద్య్రం, ఆకలి చావులు పోవాలంటే ఆయన నాయకత్వం రావాల్సి ఉందన్నారు. నాడు మంచినీటికి గొడవలు, కొట్లాటల పరిస్థితి నుంచి ప్రస్తుతం ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని కళ్లారా చూస్తున్న సరిహద్దు రాష్ర్టాల ప్రజలు తమ రాష్ర్టాల్లో ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని నిలదీస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలే తమ ప్రభుత్వాలను అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. అభివృద్ధి నిరోధకులైన బీజేపీ, కాంగ్రెస్‌లో ఉండలేక పలువురు నాయకులు బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు.
సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీటీసీ జీడి భిక్షం, పార్టీ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, నాయకులు కొణతం సత్యనారాయణ రెడ్డి, మర్ల చంద్రారెడ్డి, బెల్లంకొండ యాదగిరి, బొల్లె జానయ్య, నెమ్మాది భిక్షం, ప్రసాద్ పాల్గొన్నారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి పాలన నచ్చి చేరా ;మడిపెల్లి విక్రమ్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్
మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తున్న నిరంతర అభివృద్ధి పాలనకు ఆకర్షితుడినై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మడిపెల్లి విక్రమ్ తెలిపారు. తన 30యేండ్ల రాజకీయ జీవితంలో మంత్రి జగదీశ్‌రెడ్డి లాంటి నాయకుడిని ఇంతవరకూ చూడలేదన్నారు. ఎప్పటి నుంచో బీఆర్ఎస్లో చేరాలని ఉన్నా కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని.. ప్రస్తుతం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వచ్చినట్లు తెలిపారు. ఇతర పార్టీల్లో సందిగ్ధంలో ఉన్న కొందరు నాయకులు మరే ఆలోచన లేకుండా త్వరగా బీఆర్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు.