యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 12 : ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇతర పార్టీ అభ్యర్థుల కొనుగోలుకు తెర లేపిందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జోలికొస్తే తరిమికొడతామని హెచ్చరించారు. గురువారం యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పట్టణ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పదో వార్డులో ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమతా సాయి యాదవ్‌ను అప్రజాస్వామికంగా కొనుగోలు చేశారన్నారు. ప్రత్యక్ష ఓటింగ్‌లో పాల్గొనే దమ్ములేక స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు.
గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులను కొనుగోలు చేయాలని ఇప్పటికే వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఏ ఒక్క అభ్యర్థిని కొనుగోలు చేసినా యాదగిరి గుట్టను అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. డబ్బుతో అభ్యర్థులను కొనుగోలు చేస్తామంటే చూస్తూ ఉరుకునే ప్రసక్తేలేదన్నారు. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ పదవి తమదేనని, ఇందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను గెలుచుకుని తీరుతామన్నారు. 11 వార్డుల్లో 9 గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2,3,4,5,7,8, 9,11,12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల మంచితనంతోపాటు కేసీఆర్‌ను ప్రజలు కోరుకోవడం, గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులకు గెలుపు బాటలు వేశాయన్నారు. ఈసారి అన్ని కులాలకు సముచిత గౌరవం ఇచ్చామన్నారు.
12వార్డు అభ్యర్థిగా దొమ్మరి కులానికి చెందిన కంసాని కీర్తికి సీటు ఇచ్చామన్నారు. గతంలో ఏ పార్టీ దొమ్మరి కులాన్ని గుర్తించలేదన్నారు. దొమ్మరి కులానికి చెందిన మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. అర్థరాత్రి సమయంలో ఆమె ఇంటిని పోలీసులతో సోదా చేయించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందన్నారు. ప్రతి ఓటరుకు డబ్బు, మద్యం సరఫరా చేశారన్నారు. మహిళలకు చీరలు, వెండి వస్తువులు ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నా ఈ సారి మాత్రం కారుగుర్తుకే ఓటేస్తామని ఓటర్లు స్పష్టం చేసినట్లు గుర్తు చేశా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్‌గౌడ్, యువజన విభాగం మండలాధ్యక్షుడు బీమగాని నర్సింహగౌడ్, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముక్యర్ల సతీశ్ యాదవ్, మానుపాటి పరుశరాం, కల్వకొలను సతీశ్ భట్, లింగం, శారాజీ రాజేశ్ యాదవ్, నర్సింగ్‌గౌడ్, నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు.