నకిరేకల్, నవంబర్ 13 : కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, ప్రతి క్వింటాకు రెండు కేజీల తరుగు తీస్తున్నారని, కమీషన్ ఇవ్వకుంటే ధాన్యం కదలనివ్వమని హుకుం జారీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నకిరేకల్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళా సంఘాలకు ఒక్క సెంటర్ కూడా కేటాయించకుండా దాదాపు 10 సెంటర్లు కోఆపరేటివ్ సొసైటీలకు కేటాయించారని, సొంత మనుషులను పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు రైతుల సొమ్మును, శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఏముంటాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేటప్పుడు రెండు కేజీల తరుగు తీస్తున్నారని, లారీల్లో లోడ్ చేసేటప్పుడు రూ.3 వేల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. లోడ్ చేసిన ధాన్యం మిల్లర్లకు పోయేసరికి తాలు, మాయిశ్చర్, మొలకల పేరుతో లారీకి 10 క్వింటాలకు పైగా తరుగు తీస్తున్నారని, ఇలా రైతుల రక్తాన్ని కాంగ్రెస్ నాయకులు, మిల్లర్లు జలగల్లా పీలుస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవని గుర్తు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన నెలరోజులకు డబ్బులు పడుతున్నాయనాన్రు. ఇప్పటికీ 50శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయిందని, మండలస్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకూ ఎవరూ ధాన్యం కేంద్రాలను పరిశీలించే పరిస్థితి లేదని, రైతుల కష్టాలను పట్టించుకునే నాథుడే లేడన్నారు. ధాన్యం, పత్తి కొనడం లేదని అన్నదాతలు రోడ్లపైకొచ్చి ధర్నాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ధాన్యం తడిసి మొలకెత్తితే ఆ ధాన్యాన్ని కొనమని కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం వచ్చి 30 రోజులైనా రైతుల దగ్గర నుంచి కొనకుండా కాలయాపన చేస్తూ పది రోజులు వర్షాలు కురిసిన తరువాత ధాన్యం మొలకెత్తిందని, కాంటాలు వేయబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు జూబ్లీహిల్స్ ఎన్ని కలపై ఉన్నంత శ్రద్ధ రైతులపై గానీ, ధాన్యం కొనుగోలు చేయడంలోగానీ, రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడంలో గానీ లేదని ఎద్దేవా చేశారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం, కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెం కన్న, గుండగోని రాములు, కేతేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, మండల యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, యానాల లింగారెడ్డి, గొర్ల వీరయ్య ఉన్నారు.