నమస్తే అన్న.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా చేయి గుర్తుకే జై కొట్టినం. మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటేసినం. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కే వేస్తాం. మాకు ఇల్లు లేదు. ఎట్లయినా మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి.
సార్.. ఎన్నికల్లో మీ గెలుపు కోసం ఎంతో కష్టపడిన. మా ఇంటిల్లిపాది ఓట్లు వేయడం కాకుండా.. చుట్టపోళ్లు, ఊరోళ్లతో ఓట్లు వేయించిన. ఇప్పుడు మీరే దికు. అంతా మీదే దయ. ఎట్లయినా చేయండి.. ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించండి. పుణ్యం కట్టుకోండి..
ఇవీ.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం కాంగ్రెస్ నేతల చుట్టూ తిరుగుతూ చేస్తున్న విజ్ఞప్తులు..
కాంగ్రెస్ నేతలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు టెన్షన్ పట్టుకున్నది. అరకొర ఇండ్ల మంజూరుతో ఎవరికి ఇవ్వాలో..? ఎవరికి ఇవ్వద్దో..? అని ఆందోళన రేకెత్తిస్తున్నది. వచ్చేవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఏం చేయాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో జనం వారి చుట్టూ తిరుగుతుండడంతో సమాధానం చెప్పలేక హైరానా అవుతున్నారు.
– యాదాద్రి భువనగిరి డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ)
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి విడుతలో సొంత స్థలం ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని ప్రకటించింది. ఒకో నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను గుర్తించనుంది. గతేడాది డిసెంబర్లో ప్రజా పాలనలో భాగంగా వివిధ పథకాల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,01,977 అప్లికేషన్లు వచ్చాయి. వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో 421 గ్రామ పంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లో 104 వార్డుల్లో సర్వే నడుస్తున్నది. సాంకేతిక కారణాలతో సర్వే నత్తనడకన సాగుతున్నది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తే.. పనులు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం ఒకో ఇల్లుకు రూ.5 లక్షలు ఇవ్వనుండగా.. మరికొన్ని డబ్బులు కలిపి ఇల్లు కట్టుకోవాలని చాలామంది నిరీక్షిస్తున్నారు. సర్వే తర్వాత లబ్ధిదారుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ నాయకుల ఇండ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇండ్ల కోసం ఎదురుచూసేవారు కాంగ్రెస్ లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. నిత్యం ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ గుర్తు చేస్తున్నారు.
నేతలు ఎకడ కలిసినా ఇదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎట్లయినా తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో కొందరు నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జనం, కార్యకర్తలు నొచ్చుకోకుండా సమాధానం ఇస్తున్నారు. మరోవైపు స్థానిక నేతలు సైతం ఎమ్మెల్యేలను కలుస్తూ.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమవారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల సమరం షురూ కానుంది. సర్పంచ్, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఇందిరమ్మ ఇండ్ల ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామాల్లో సర్పంచ్, వార్డు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్‌గా పోటీలో నిలబడే వారికి ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేకపోలేదు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మాత్రమే కావడంతో ఒకో ఊరికి 20 ఇండ్ల లోపే రానున్నాయి. ఆయా చోట్ల తమ అనుకున్న వారికి మంజూరు చేస్తే.. మిగతా వారంతా వ్యతిరేకయ్యే అవకాశాలు ఎకువగా ఉన్నాయి. ఇండ్లు మంజూరు చేయించుకున్నోళ్లే ఓటర్లా.. తాము కాదా అనే చికులు ఉత్పన్నం కానున్నాయి. ఫలితంగా ఎన్నికల్లో గెలుపోటములు తారుమారుకు ఆసారం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.