Manoj Bajpayee | సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా కులం, మతం, వృత్తులు లేదా వర్గాల ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో సినిమాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయి నటించిన కొత్త చిత్రం కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలకు ముందే టైటిల్‌పై తీవ్ర చర్చలు మొదలయ్యాయి.
బుధవారం (ఫిబ్రవరి 04) ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే సినిమా కథ కంటే టైటిల్‌నే ఎక్కువ వివాదానికి దారితీసింది. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పేరు ‘ఘూస్ఖోర్ పండిట్’. ఈ టైటిల్‌నే కొంతమంది అభ్యంతరకరంగా భావిస్తూ వ్యతిరేకిస్తున్నారు. ‘ఘూస్ఖోర్ పండిట్’ అనే పదానికి “లంచం తీసుకునే పండిట్” లేదా “అవినీతి పండిట్” అనే అర్థం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది బ్రాహ్మణ వర్గాన్ని అవమానించేలా ఉందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టైటిల్ మార్చకపోతే సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై #BoycottMovie వంటి ట్రెండ్లు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయి ఓ అవినీతి పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ట్రైలర్ ప్రకారం ఆయన పాత్ర కోపిష్టిగా, క్రూర స్వభావంతో, లంచాలు తీసుకునే వ్యక్తిగా చూపించారు. సినిమాలో ఆయన అసలు పేరు అజయ్ దీక్షిత్, అయితే అతని ముద్దు పేరు “పండిట్”గా చూపించారు. అదే పేరు టైటిల్‌గా పెట్టడం వివాదానికి కారణమైంది. నుస్రత్ భారుచా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ షా దర్శకత్వం వహిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది విడుదల కానుంది. సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి అధికారిక స్పందన రాలేదు. టైటిల్ మార్చుతారా? లేక వివరణ ఇస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓటీటీ విడుదలకు ముందు ఈ వివాదం మరింత ముదిరే అవకాశమూ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.