Nick Jonas | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ గాయకుడు నిక్ జోనాస్ ఇటీవల తన కూతురు మాల్తీ మేరీ పుట్టిన రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. జే శెట్టి పాడ్కాస్ట్లో పాల్గొన్న నిక్, మాల్తీ జననం సమయంలో ఎదుర్కొన్న కష్టసుఖాలను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2022లో సరోగసీ ద్వారా ప్రియాంక–నిక్ దంపతులకు మాల్తీ మేరీ జన్మించిన విషయం తెలిసిందే. అయితే పుట్టినప్పుడు మాల్తీ చాలా తక్కువ బరువుతో జన్మించిందని, ఆ కారణంగా మూడున్నర నెలల పాటు ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్స అందించాల్సి వచ్చిందని నిక్ వెల్లడించాడు. పుట్టిన సమయంలో ఆమె బరువు కేవలం 1 పౌండ్ 11 ఔన్సులు, అంటే సుమారు 765 గ్రాములే ఉండటంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని తెలిపాడు.
అనుకున్నదానికన్నా ముందుగానే డెలివరీ జరిగిందని, పుట్టిన వెంటనే శరీరం పర్పుల్ రంగులోకి మారడం తమను భయపెట్టిందని గుర్తుచేసుకున్నాడు. ఆసుపత్రిలో గడిపిన ఆ రోజులు జీవితాంతం మర్చిపోలేనివని చెప్పిన నిక్, తాను, ప్రియాంక ప్రతిరోజూ 12 గంటల షిఫ్టుల వారీగా ఆసుపత్రిలోనే ఉండేవాళ్లమని తెలిపాడు. కోవిడ్ సమయంలో మూడున్నర నెలల పాటు హాస్పిటల్ వాతావరణంలోనే గడపాల్సి వచ్చిందని, ఇప్పటికీ ఆ ఆసుపత్రి వాసన తనకు గుర్తొస్తుందని అన్నాడు. తమలాగే మరికొన్ని కుటుంబాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటూ కనిపించడం ఒకవైపు భయానకంగా అనిపించిందని, మరోవైపు ఓదార్పు కలిగించిందని చెప్పాడు. ఆ కాలంలో మాల్తీ ప్రాణాల కోసం ప్రతి రోజూ పోరాడిందని, క్రమంగా బరువు పెరిగిందని, ఆరు సార్లు రక్త మార్పిడి చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైందని తెలిపాడు.
చివరికి మూడున్నర నెలల తర్వాత ఆమెను ఇంటికి తీసుకురాగలిగిన క్షణం తమ జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజుగా నిలిచిందని భావోద్వేగంగా వివరించాడు. ప్రస్తుతం మాల్తీ ఎదుగుదలను చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందని, ఆమెలో ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉందని నిక్ చెప్పాడు. నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా 2018లో రాజస్థాన్లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. 2022 జనవరిలో మాల్తీ మేరీ జన్మించింది. ఇక కెరీర్ విషయానికి వస్తే నిక్ త్వరలో ‘పవర్ బల్లాడ్’ చిత్రంలో నటించనుండగా, ప్రియాంక చోప్రా కూడా పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.