సూర్యాపేట, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలంటేనే కాంగ్రెస్ పార్టీ నేతల గుండెల్లో వణుకు ప్రారంభమైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, ఇతర పెద్ద నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడాలంటూ స్థానిక నేతలకు సమాచారం ఇస్తే వామ్మో…మా .వల్ల కాదు… ఎంత ఖర్చు చేసినా గెలిచేది లేదు.. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల ఓటమి ఖాయమంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ వారైతే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే చాలు.. పైసలు ఖర్చు చేయకున్నా గెలుస్తామనే ధీమాతో ఉన్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో జనాన్ని మోసం చేసి రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. దీంతో జనం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రధానంగా పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని బలంగా నమ్మిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ప్రతి పంచాయతీకి పల్లె ప్రగతి పేరిట కోట్లాది రూపాయలు మంజూరు చేసి కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. పుష్కలంగా జలాలు, 24 గంటల విద్యుత్తు సరఫరాతో వ్యవసాయం పండుగలా మారింది. దీంతో రైతుల జేబులు గలగలలాడాయి. అలాగే వ్యవసాయ అనుబంధంగా చేపలు, గొర్రెల పెంపకం వంటి పథకాలతో పల్లెల్లో సంపద పెరిగింది. మరో పక్క ప్రతి పంచాయతీలో అంతర్గత రోడ్లు, మండలాలకు రహదారులతో పాటు హరితహారం పథకంలో భాగంగా ప్రగతి వనాలు, కోట్లాది మొక్కలు నాటడంతో పల్లెలు పచ్చగా మారాయి. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లు, మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్లు, డంపింగ్ యార్డులు, సెగ్రి గేషన్ షెడ్లు, అత్యాధునిక వసతులతో శ్మశానవాటికలు, రైతు వేదికలు.. ఇలా చెప్పుకుంటూ పోతే పల్లెలు పూర్తిగా మారిపోయాయి. స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఓటమి భయంతో అధికార కాంగ్రెస్‌లో చలనం కనిపించడం లేదు.
అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించిన ఆ పార్టీ నాయకులు స్థానిక ఎన్నికల్లో నిలబడి ఓటమి పాలయ్యే దానికంటే కామ్‌గా ఉంటేనే మంచిదని పలువురు నేతులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ చేపట్టిన పనులన్నీ నిలిచిపోవడంతో నేడు జనం మళ్లీ ఆయన వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారన్నారు. ప్రస్తుతం యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందని, ఈ సమయంలో తాము వీధుల్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ ఎన్నికల్లో నిలబడినా తాము ప్రజలకు ఏం చెప్పినా నమ్మబోరని రెండేండ్లలో ఏం వెలగబెట్టారు… ఇప్పుడేం చేస్తారని ప్రశ్నిస్తారంటున్నారు. డబ్బులు పెట్టగలిగే స్థోమత ఉన్న నేతలు కూడా ఇప్పటికే రెండేండ్లుగా పల్లెల్లో ఒక్క పనీ చేయలేదు. పైగా అప్పు పుట్టట్లేదు… డబ్బుల్లేవు అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు తోడు కేసీఆర్ హయాంలో మాదిరిగా పల్లె ప్రగతి నిధులు వచ్చే అవకాశమే లేదు. డబ్బుతో గెలిచినా పనులు చేయలేక ఉన్న పరువు పోగొట్టుకోవడమేనని బడా నేతల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎన్నికల్లో నిలబడేందుకు ఉత్సాహంతో ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయాం… ఇక జీవితంలో ఆ పార్టీకి ఓటేయమంటూ జనం బహిరంగంగా తెగేసి చెబుతున్నారు. దీంతో బరిలో నిలిచే బీఆర్ఎస్ నేతల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాము డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ప్రజలే బీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాము పోటీకి దూరంగా ఉండటమే మంచిదంటూ కాంగ్రెస్ నేతలు వెనుకంజ వేస్తున్నారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటేనే భయమేసేది. ఈసారి మాత్రం డబ్బు ఖర్చు చేయకున్నా గెలవడం ఖాయం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో గ్రామాలు పూర్తిగా అభివృద్ధి చెందాయి. గడిచిన రెండేండ్లలో గ్రామాల్లో పారిశుధ్యం తదితర సమస్యలతో అన్ని విధాలుగా గ్రామాలు వెనుకబడ్డాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి నయా పైసా కూడా విదల్చకపోవడంతో గత ఎన్నికల్లో గెలిచిన మాజీ ప్రజాప్రతినిధులు ఎవరూ మళ్లీ పోటీ చేసేందకు ఆసక్తిగా లేరు.