నకిరేకల్, మే 8: ‘ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి సీఎం రేవంత్‌రెడ్డి పొద్దున కాంగ్రెసోళ్లతో, రాత్రి బీజేపీ వాళ్లతో చర్చలు జరిపి తిరిగి తెలంగాణకు వస్తారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాష్ట్రంలో అప్రజాస్వామిక పద్ధతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మాజీ మంత్రులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు చేస్తూ నీచమైన సంస్కృతికి తెరలేపుతున్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే దాడులు, దౌర్జన్యాలేనా?, రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదు.
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం తప్పదు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు సీఎం కేసీఆర్‌కు పట్టం కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనంతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల దాడిని ఖండిస్తూ నకిరేకల్‌లోని సువర్ణగార్డెన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం చిరుమర్తి లింగయ్య విలేకర్లతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో కుమ్మక్కై రాష్ర్టానికి రావాల్సిన వాటాను దోచుకొని ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకురాకపోవడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పల్లె విజయ్, కడపర్తి, సర్పంచ్‌లు గొర్ల వీరయ్య, బంటు రవి, మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య, యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, మాజీ వైస్ ఎంపిపి సామ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, నాయకులు యానాల లింగారెడ్డి, దైద పరమేశ్, ఎస్కె అమీర్‌పాషా, స్టీఫెన్, ఎమ్‌డి అఖిల్, తదితరులు పాల్గొన్నారు.