పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలోనే ఎవరూ ఊహించంత అభివృద్ధి చేశారని, అన్ని వర్గాల ప్రజలకు గులాబీ జెండా అండగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అనే నమ్మకం ప్రజలందరిలోనూ బలంగా ఉందని తెలిపారు. శనివారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పాలవరపు వేణుతోపాటు దాదాపు 90 మంది మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రగతి గడపకూ సంక్షేమ ఫలాలు అందాయని, ఈ విషయాన్ని ప్రజలే స్వయంగా వివరిస్తూ అభిమానం చాటుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనతో విపక్షాల్లో వణుకు మొదలైందని, అందుకే ఆ పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి గుణపాఠం చెప్పాలని కోరారు.
సూర్యాపేట టౌన్, అక్టోబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత తొమ్మిదిన్నరేండ్లుగా ఎవరూ ఊహించని రీతిలో జరుగుతున్న అభివృద్ధితో అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చిన గులాబీ జెండానే అందరికీ అండగా నిలిచిందని, ఆ నమ్మకంతోనే అందరి జీవితాల్లో ధీమా పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు పాలవరపు వేణు తన 90 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి నేడు యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
గత తొమ్మిదిన్నరేండ్లలో జిల్లాను కోట్లాది రూపాయలతో ఎవరూ ఊహించని రీతిలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా గమనిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్కు ఓటు వేశాకే ప్రజలందరి తలరాతలు మారాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తిరుగులేని పాలనతో విపక్షాల్లో వణుకు మొదలైందని, అందుకే ఆయా పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో నేరవేర్చలేని హామీలతో తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలో బడా నాయకులమని చెప్పుకుంటున్న వారు గతంలో చేసిన రౌడీ రాజకీయాలు, సిండికేట్ దందాలను ఇక్కడి ప్రజలు మరిచిపోలేరన్నారు.
నాడు ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా, నీరు పారాల్సిన కాల్వలు, చెరువులు ముళ్లపొదలతో దర్శనమిచ్చేవని, దాంతో వ్యవసాయం సాగక వలసలు వెళ్లిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. నేడు తాగు, సాగుకు పుష్కలంగా నీరందుతుండడంతోపాటు నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయం పండుగలా చేసుకుంటూ రైతులు, ప్రజలు ధీమాగా జీవిస్తున్నట్లు తెలిపారు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కు జై కొడుతూ గులాబీ గూటికి చేరుతున్నారని అన్నారు. ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సంతోశ్‌రెడ్డి, అనంతరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.