బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నది. ఆలేరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ సర్కార్ గప్పాలు కొడుతున్నది. వాస్తవానికి ఈ పనులన్నీ బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసినవే.. ఇటీవల ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో బహిరంగసభకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులకే తిరిగి శంకుస్థాపనలు చేశారు. సీఎం శంకుస్థాపన చేసిన గంధలమల్ల జలాశయం, ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు కాల్వపల్లి, కొలనుపాక బ్రిడ్జీలు రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ మంజూరు చేసినవే.
యాదగిరిగుట్ట, జూన్ 12: యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయాన్ని కేసీఆర్ ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఇక్కడే వైద్య కళాశాల నిర్మించాలని సకల్పించారు. వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో మల్లాపురం గ్రామంలో శాశ్వత వైద్య కళాశాల భవనం నిర్మించాలని యోచించారు. 2023 సెప్టెంబర్ 16న జీవో నంబర్ 85 ప్రకారం రూ. 183 కోట్ల పరిపాలన అనుమతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యుద్ధ్దప్రాతిపదికన సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారే తప్ప.. వైద్య కళాశాల ఎక్కడ నిర్మిస్తారో స్పష్టత ఇవ్వలేదు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 15వ ప్యాకేజీ నిర్మాణంలో తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామం వద్ద ఉన్న చెరువును 9.86 టీఎంసీ సామర్థ్యంతో జలశయం నిర్మించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ. 860.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. సుమారు 4,027 ఎకరాల వ్యవసాయం, అటవీ భూమితోపాటు గంధమల్ల, వీరారెడ్డిపల్లి గ్రామాలు పూర్తిగా ముంపు గురవుతాయని యోచించింది. అక్కడి రైతుల తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. దీంతో అప్పటి కేసీఆర్ సర్కార్ నీటి సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదిచింది. గంధమల్లను రీడిజైన్ చేసింది. ఇందుకు గానూ బీఆర్ఎస్ ప్రభు త్వం రూ. 569.60 కోట్ల నిధులను మం జూరు చేసింది. దీని ద్వారా కేవలం గంధమల్ల గ్రామంతోపాటు చుట్టూ ఉన్న 2500 ఎకరాల వ్యవసాయం, అటవీ భూమి ముంపు బారిన పడే అవకాశం ఉంది. ఈ డిజైన్‌ను సైతం అక్కడి గ్రామస్తులు తీవ్రం గా వ్యతిరేకించడంతో చేసేదేమీ లేక గంధమల్ల జలాశయం పనులను నిలిపివేశారు. ప్రస్తుతం 0.002 టీఎంసీ సామర్థ్యంతో ఉన్న గంధమల్ల చెరువులోకి కాళేశ్వరం జలాలను అందించాలని సంకల్పించి 1.48 టీఎంసీ నీటి సామర్థ్యం గల గంధమల్ల జలాశయాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. గుత్తా అమిత్‌రెడ్డి గత టెండర్లను దక్కించుకొని పనులను ప్రారంభించేందుకు సిద్ధ్దమయ్యారు. ఇది గమనించని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం గంధమల్ల జలాశయాన్ని మేం ప్రతిపాదించాం. నిర్మాణం చేస్తామంటూ శంకుస్థాపన చేశారు.
కొలనుపాక గ్రామంతోపాటు రాజాపేట మండలంలోని కాల్వపల్లి హైలెవల్ బ్రిడ్జీ నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరయ్యాయి. కొలనుపాకలో సుమారు రూ. 4 కోట్లు, కాల్వపల్లిలో రూ. 10 కోట్లు నిధులు మంజూరు కాగా అప్పటి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 2023 ఆగస్టు 4వ తేదీన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇదే పనులకు ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరిగి శంకుస్థాపనలు చేశారు. వేద పాఠశాలకు రాయగిరి రైల్వే స్టేషన్ వద్దగల వేంకటేశ్వర స్వామివారి కొనేరు వద్ద గతేడాది 2023లోనే మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపనన చేశారు. తాజా కాంగ్రెస్ ప్రభుత్వం వేద పాఠశాల స్థలాన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఇలా బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన చాలా పనులకు మళ్లీ క్రాంగెస్ నాయకులు శంకుస్థాపన చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.