నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 4 : హైదరాబాద్‌లో ఈ నెల 7న మాదిగలు నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు.. వేయి గొంతులు బహిరంగ సభను మాదిగలంతా విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. నార్కట్‌పల్లిలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న మాదిగల ప్రదర్శనను ప్రభుత్వం అడ్డుకుంటున్నదని, అనుమతి లేదని పొంతన లేని సాకులతో ఆపాలని చూస్తున్నదని అన్నారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణపై మాదిగలు 30 ఏండ్లుగా సుధీర్ఘ పోరాటం చేస్తున్నారని, ఎంతో మంది జీవితాలు త్యాగం చేశారని తెలిపారు.
పోరాటాల ద్వారానే సుప్రీం కోర్టు ఏబీసీడీ వర్గీకరణకు ఆదేశించినట్లు చెప్పారు. వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ ద్వారా వెల్లడించిన తర్వాత మాట మార్చారని, ఇప్పుడు మాల మాదిగల మధ్య పంచాయితీలు పెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాదిగలపై ఇకనైనా విమర్శలు మానుకోవాలని, లేకపోతే సరైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. లక్ష డప్పులు.. వేయి గొంతుల కార్యక్రమంలో ఏమైనా ఆటంకాలు జరిగితే సీఎం రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే నవంబర్ 29, 2014లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయమంటే ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కుంటి సాకులు చెప్పిందని అన్నారు.
నేడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. డప్పు ద్వారా చేస్తున్న ప్రచార ప్రదర్శనను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదన్నారు. ఈ సమావేశంలో చిట్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మాజీ కౌన్సిలర్ బొందయ్య, నాయకులు చిరుమర్తి యాదయ్య, బాషపాక రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.